మణిపూర్ ఘటనపై నేడు సుప్రీం సుమోటో విచారణ.. - హడావుడిగా కేసు సీబీఐకి బదిలీ చేసిన కేంద్ర హోంశాఖ!
మహిళలపై హింస దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఈ వీడియోతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారని, ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని తెలిపింది.
మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై జరిగిన అమానవీయ ఘటనపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. సోషల్ మీడియా, మీడియా ద్వారా మణిపూర్ ఘటన వీడియో వైరల్ కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు దీనిని సుమోటోగా స్వీకరించింది. జూలై 20న ఈ ఘటనపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ధర్మాసనం అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలను ఉద్దేశిస్తూ.. యావత్ దేశమే కాదు.. ఈ న్యాయస్థానాన్నీ ఆ వీడియో బాధించిందని తెలిపింది. మహిళలపై హింస దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఈ వీడియోతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారని, ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని తెలిపింది. నేరస్తులను శిక్షించే విషయంలో ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేకపోయాయని, ప్రభుత్వాలు గనుక చర్యలు చేపట్టకపోతే తామే రంగంలోకి దిగుతామని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఈ నేపథ్యంలోనే జూలై 28వ తేదీకి ఈ కేసు విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియజేయాలని కేంద్రాన్ని ఈ సందర్భంగా ఆదేశించింది. శుక్రవారం దీనిపై విచారణ జరగనున్న నేపథ్యంలోనే కేంద్రం హడావుడిగా ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. విచారణకు ఒక్కరోజు ముందు గురువారం నాడు మణిపూర్ హింసపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం. నేటి విచారణలో కేంద్రం అఫిడవిట్‌పై సుప్రీం ధర్మాసనం ఎలా స్పందిస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.