మహిళలపై లైంగిక దాడులకు.. వారూ ఓ కారణమే.. హర్యానా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వివాదాస్పద వ్యాఖ్యలు
అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి ఓయో రూమ్స్ కు వెళ్లే ముందు ఒక్కసారి అక్కడి పరిస్థితుల గురించి ఆలోచించుకోవాలని సూచించారు.
దేశంలో ఇటీవల కాలంలో లైంగిక దాడుల సంఖ్య విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే మహిళలపై లైంగిక దాడులు జరగడానికి వారు కూడా ఒక కారణమని హర్యానా మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేణు భాటియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. యువతులు తమ బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి ఓయో రూమ్స్ కు వెళ్లడం వల్లే లైంగిక దాడుల సంఖ్య పెరుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓయో హోటళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది. మొదట పెద్దపెద్ద నగరాల్లో మాత్రమే ఓయో హోటళ్లు ఉండేవి. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో కూడా అవి ఏర్పాటయ్యాయి. అయితే ఓయో అనేది ఒక యాప్ కావడంతో.. ఆ యాప్ లో గదులు బుక్ చేసుకుంటున్నా వారి వివరాలు యాజమాన్యాలు సరిగ్గా తెలుసుకోవడం లేదు. దీంతో అసాంఘిక కార్యక్రమాలకు ఇటువంటి హోటళ్లను కొందరు వాడుకుంటున్నారు.
కైతాల్ లోని ఆర్కే ఎస్డీ కళాశాలలో చట్టాలు, సైబర్ క్రైమ్ పై జరిగిన అవగాహన సమావేశంలో రేణు భాటియా మాట్లాడుతూ.. అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి ఓయో రూమ్స్ కు వెళ్లే ముందు ఒక్కసారి అక్కడి పరిస్థితుల గురించి ఆలోచించుకోవాలని సూచించారు. స్నేహం ముసుగులో అక్కడికి తీసుకెళ్లి అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం ఉందనే విషయాన్ని గ్రహించాలన్నారు. 'అమ్మాయిలు ఓయో రూమ్ కు వెళ్ళేది హారతులు ఇవ్వడానికి కాదు.. ఆ హోటళ్లకు వెళ్లే ముందు అక్కడ మీకు హాని జరగవచ్చనే విషయాన్ని గుర్తించుకోండి' అని ఆమె వ్యాఖ్యానించారు.
ఇక సహజీవన చట్టంలో కూడా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. సహజీవన చట్టంలో సుప్రీంకోర్టు జారీ చేసిన నిబంధనల వల్ల మహిళలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో తమ పరిధి చాలా తక్కువ అయ్యిందని చెప్పారు. కాగా, అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి ఓయో రూమ్స్ వెళ్తున్నారని.. దీనివల్ల లైంగిక దాడుల సంఖ్య పెరుగుతోందని రేణు భాటియా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
మహిళా కమిషన్ చైర్ పర్సన్ అయి ఉండి మహిళలను తక్కువ చేసే విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటని కొందరు విమర్శలు చేశారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యల్లో తప్పేమిలేదని, అమ్మాయిలకు అవగాహన కల్పించేందుకే ఆమె ఆవిధంగా వ్యాఖ్యలు చేశారని మరికొందరు అంటున్నారు.