హర్ ఘర్ తిరంగా: ఇళ్ళు కూల్చేశారు, జెండా మిగిలింది

ఢిల్లీలోని ఓ మురికి వాడలోని అన్ని ఇళ్ళపై జాతీయ జెండాలు ఎగురుతున్నాయి. మూడురోజుల క్రితం పొద్దున్నే ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు బుల్‌డోజర్‌లను తీసుకొని ఆ ఇళ్ళన్నింటినీ కూల్చేశారు. ఇప్పుడా మురికి వాడ ప్రజలకు జెండాలు మిగిలాయి... ఇళ్ళు లేవు.

Advertisement
Update:2022-08-14 13:39 IST

స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల వేళ.... స్వాతంత్య్ర ఫలాల కోసం ఎదురు చూస్తున్న పేదలు కోట్లలో ఉన్నారు. చేతిలో అధికారమో, జేబుల్లో డబ్బులో లేకుంటే ఈ దేశంలో జీవించడం అగమ్యగోచరమయ్యింది. ఇప్పటికీ కోట్లాది మంది. అర్దాకలితో, ఉండేందుకు ఇల్లు లేక, కట్టుకునే బట్టలు కూడా లేక బతుకు ఈడుస్తున్నారు. అయీనా వాళ్ళ బతుకేదో వాళ్ళు బతుకుతుంటే ప్రభుత్వాలు అలా కూడా బతకనివ్వడం లేదు. ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన మన స్వాత్రంత్య్రం ఎవరికోసమో, ప్రధాని పిలుపునిచ్చిన హర్ ఘర్ తిరంగా నినాదండొల్లతనమెంతో తెలియజేస్తోంది.

అవి ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ సమీపంలోని మురికివాడలు... అక్కడ నివసిస్తున్నదంతా రోజు కూలీ చేసుకునే వాళ్ళే. ఆగస్టు 8న ఉదయాన్నే ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు బుల్‌డోజర్‌లను తీసుకొని ఆ వాడల‌పై పడ్డారు. అంతకు ముందురోజే అధికారులు అక్కడ నివాసం ఉండేవాళ్ళకు నోటీసులిచ్చారు. ఆగస్టు 8న చెప్పిన సమయం కన్నా ముందే వచ్చి ప్రజలు ఎంత మొత్తుకుంటున్నా ఇళ్ళను కూల్చివేయడం మొదలు పెట్టారు. ఇళ్ళలోంచి వాళ్ళ‌ సామాన్ల‌ను బైటికి తీసుకొచ్చేందుకు అవకాశం సమయం కూడా ఇవ్వలేదు. అన్ని ఇళ్ళపై ఎగురుతున్న జాతీయ జెండాలతో సహా ఇళ్ళను కూల్చి వేశారు.

అక్కడున్న మగవాళ్ళు, స్త్రీలు బుల్డోజర్లకు అడ్డుపడి అధికారులను బతిమిలాడుకున్నారు. స్త్రీలు బోరున ఏడుస్తూ అధికారుల కాళ్ళపై పడ్డారు. అయినా అధికారుల మనసు కరగలేదు.

అధికారులు మా ఇంటి నుంచి అవసరమైన వస్తువులను బయటకు తీయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇళ్ళపై మేము త్రివర్ణ పతాకాలను ఎగురవేశాం ఇప్పుడు ఇళ్ళే లేవు వాటిని ఎక్కడ ఎగరేయాలి''అని అక్కడి మురికివాడలో నివసించే రంజిత్ కుమార్ ప్రశ్నించారు.

కాగా, ఢిల్లీ నివాసితులు వినోద ఉద్యానవనంతో పాటు స్వచ్ఛమైన గాలిని పొందేందుకు అని చెప్పి ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ బన్సెరా అనే ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రాజెక్ట్ కింద, ఢిల్లీలోని యమునా పరిసర ప్రాంతాలలో వెదురు వనాలు పెంచుతారు. ఆగస్టు 9న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అందులో భాగంగానే ఈ మురికి వాడల‌ ప్రజల ఇళ్ళను కూల్చి వేశారు.

ఆగస్టు 10న, ఈ మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలు ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయం వెలుపల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుగుతున్న వేళ ఇక్కడి మురికి వాడల ప్రజలు ఉన్న కాస్త ఇళ్ళు కూడా కోల్పోయి రోడ్డునపడ్డారు. 75 ఏళ్ళ స్వాతంత్య్రం వాళ్ళను ఇవ్వాళ్ళ రోడ్డు మీద నిలబెట్టింది. చివరకు జాతీయ జెండా కూడా వాళ్ళను కాపాడలేకపోయింది.

Tags:    
Advertisement

Similar News