బీబీసీపై చర్యలకు గుజరాత్ అసెంబ్లీ తీర్మానం..

ప్రభుత్వ ప్రతీకార చర్యల్లో భాగంగా ఇటీవల బీబీసీపై ఐటీ దాడులు కూడా జరిగాయి. ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది.

Advertisement
Update:2023-03-11 19:17 IST

బీబీసీపై చర్యలకు గుజరాత్ అసెంబ్లీ తీర్మానం..

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ చేసిన పాపాలను ఇటీవల మరోసారి బీబీసీ వెలుగులోకి తెచ్చిన తర్వాత బీజేపీ ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. ఆమధ్య బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలు కూడా జరిగాయి. కొండను తవ్వి ఎలుకను పట్టుకోలేకపోయినా భారత్ లో ఉంటే మా మాట వినాల్సిందేనని బీబీసీకి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది కేంద్రం. ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీ బీబీసీపై చర్యలకు తీర్మానం చేసింది.

‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’ అంటూ బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ భారత్ లో అందుబాటులో లేకుండా చేసింది కేంద్రం. దాని మూలాలను కూడా సోషల్ మీడియాలో లేకుండా చేసింది. ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు ఆ వీడియో లింక్ లను షేర్ చేస్తున్నా కూడా వాటిని డిలీట్ చేసి తమ నిరంకుశత్వాన్ని చాటుకుంది కేంద్రం. ఆ తర్వాత బీబీసీకి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలకు సిద్ధమైంది. ప్రభుత్వ ప్రతీకార చర్యల్లో భాగంగా ఐటీ దాడులు కూడా జరిగాయి. ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది.

బీబీసీ డాక్యుమెంటరీ వాస్తవాలను వక్రీకరించిందని, ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని గుజరాత్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్ర హోం మంత్రి హర్ష్ సంఘవితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం బీబీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. బీబీసీ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ఉద్దేశంతోనే ఇలాంటి డాక్యుమెంటరీని రూపొందించిందని ఎమ్మెల్యే విపుల్ పటేల్ అన్నారు.

రెండు గంటల చర్చ అనంతరం తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు గుజరాత్ ఎమ్మెల్యేలు. ఈ డాక్యుమెంటరీ ప్రధాని మోదీకి మాత్రమే వ్యతిరేకం కాదని, 135 కోట్ల ప్రజలకు వ్యతిరేకం అని హోం మంత్రి హర్ష్ సంఘవి పేర్కొన్నారు. ఈ అల్లర్లపై నియమించిన కమిషన్లతోపాటు, సుప్రీంకోర్టు కూడా గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇచ్చిందని, అయినా కూడా ఇలాంటి డాక్యుమెంటరీలు ఎందుకు తయారు చేశారని ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News