20 ఏళ్లలో తొలిసారి క్రైస్తవ అభ్యర్థికి బీజేపీ టికెట్

గుజరాత‌ఖ‌లోని వ్యారా నియోజకవర్గంలో తొలిసారిగా గిరిజన క్రైస్తవుడికి టికెట్ ఇచ్చింది బీజేపీ. వ్యారా నుంచి నాలుగు సార్లు కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన పునాజీ గమిత్‌పై బీజేపీ తరపున మోహన్ కొంకణి పోటీ చేయబోతున్నారు.

Advertisement
Update:2022-11-18 15:42 IST

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం తెగ ఆరాటపడిపోతోంది. ఎప్పుడూ లేని ప్రయోగాలు చేస్తోంది, ఆరు సార్లు వరుసగా విజయం సాధించిన అభ్యర్థిని సైతం పక్కనపెట్టేలా ఈ ప్రయోగాలున్నాయి. రెబల్స్ భయపెడుతున్నా కూడా గెలుపు ధీమా ఉన్న అభ్యర్థుల్నే ఏరికోరి తెస్తోంది. భారీగా డబ్బు కుమ్మరించే వాళ్లకే టికెట్లు ఇస్తోంది. ఈ దశలో 20 ఏళ్లలో తొలిసారి బీజేపీ ఓ క్రైస్తవ అభ్యర్థికి గుజరాత్‌లో టికెట్ ఇచ్చింది. కాదు కాదు ఇవ్వాల్సి వచ్చింది.

ఆ నియోజకవర్గం పేరు వ్యారా. 2007 నుంచి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 182 అసెంబ్లీ సీట్లున్న గుజరాత్‌లో 27 గిరిజన రిజర్వేషన్ స్థానాలున్నాయి. ఒడిశా తర్వాత అత్యధిక‌ ఎస్టీ స్థానాలున్న రాష్ట్రం గుజరాత్. ఈ ఎస్టీ రిజర్వ్ డ్ స్థానాల్లో ఎనిమిది చోట్ల క్రైస్తవుల ఆధిపత్యం ఉంది. అక్కడ బీజేపీ ఇప్పటి వరకు ఓ క్రైస్తవుడికి కూడా టికెట్ ఇవ్వలేదు. కానీ ఈసారి వ్యారా నియోజకవర్గంలో తొలిసారిగా గిరిజన క్రైస్తవుడికి టికెట్ ఇచ్చింది బీజేపీ. వ్యారా నుంచి నాలుగుసార్లు కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన పునాజీ గమిత్‌పై బీజేపీ తరపున మోహన్ కొంకణి పోటీ చేయబోతున్నారు.

వ్యారా అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట. 2.23 లక్షల మంది ఓటర్లలో 45 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. కానీ ఈసారి బీజేపీ అభ్యర్థిగా తాను గెలిచి చరిత్ర సృష్టిస్తానంటున్నారు కొంకణి. పార్టీ హైకమాండ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానంటున్నారు. వ్యారాలో ఉన్న 72,000 మంది క్రైస్తవ ఓటర్ల మద్దతు తనకే ఉందని ధీమాగా చెబుతున్నారు. బీజేపీలో హిందూత్వ శకం ముగిసిందని, ఇప్పుడంతా "సబ్ కా సాథ్, సబ్ కా వికాస్." అని చెబుతున్నారాయన. మరి ఈ ప్రయోగం ఫలిస్తుందా. 20 ఏళ్ల తర్వాత బీజేపీ ఓ క్రిస్టియన్‌కి ఇచ్చిన టికెట్ ఆ పార్టీపై ఉన్న హిందూత్వ మరకను చెరిపేయగలదా..? వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News