వాలంటీర్లు అవసరం లేదు.. డ్రోన్ ద్వారా పెన్షన్ డోర్ డెలివరీ

ఈనెల మాత్రం ఆబాధను తప్పించారు అధికారులు. ఇంటికే పెన్షన్ ఎగురుకుంటూ వచ్చేలా చేశారు. డ్రోన్ ద్వారా డోర్ డెలివరీ చేపట్టారు.

Advertisement
Update:2023-02-21 07:31 IST

ఏపీలో ప్రతినెలా ఒకటో తేదీన సామాజిక పెన్షన్ ని వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో లబ్ధిదారులు పంచాయతీ ఆఫీస్ లకు వెళ్లి పడిగాపులు పడే అవసరాన్ని తప్పించామని ఇంటికే వాలంటీర్లు పెన్షన్ తెచ్చి ఇచ్చి వెళ్తున్నారని గర్వంగా చెప్పుకుంటుంది. అయితే ఒడిశా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వాలంటీర్లు కాదు, అంతకు మించి అంటున్నారు అక్కడి అధికారులు. ఏకంగా డ్రోన్ ద్వారా పెన్షన్ పంపిణీ చేపట్టారు. అయితే అందరికీ కాదండోయ్, ఇల్లు కదల్లేని స్థితిలో ఉన్న ఓ వికలాంగుడికి ఇలా వెరైటీగా పెన్షన్ డబ్బులు అందించారు.

సహజంగా మారుమూల ప్రాంతాలకు, అత్యవసర మందులు అందించడానికి ఇటీవల డ్రోన్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే మారుమూల ప్రాంతంలో ఇల్లు కదల్లేని స్థితిలో ఉన్న ఓ వికలాంగుడికి రాష్ట్ర ప్రభుత్వం అందించే సామాజిక పెన్షన్ ని డ్రోన్ ద్వారా పంపించి ఆశ్చర్యపరిచింది ఒడిశా ప్రభుత్వం. ఒడిశా రాష్ట్రం నౌపడ జిల్లాలో మారుమూల గ్రామం భుత్కాపడనిలో హితారామ్‌ సత్నామీ నివశిస్తున్నాడు. వికలాంగుడైన సత్నామీ ఇల్లు కదలలేని స్థితిలో ఉన్నాడు. ఒడిశా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మధుబాబు పెన్షన్‌ యోజన’ లబ్ధిదారుడైన సత్నామీ.. ప్రతినెలా దట్టమైన అడవిలో 2 కిలోమీటర్లు ఇతరుల సాయంతో ప్రయాణించి, పంచాయతీ కార్యాలయానికి వెళ్లి పెన్షన్‌ తెచ్చుకొనేవాడు. ఈనెల మాత్రం ఆబాధను తప్పించారు అధికారులు. ఇంటికే పెన్షన్ ఎగురుకుంటూ వచ్చేలా చేశారు. డ్రోన్ ద్వారా డోర్ డెలివరీ చేపట్టారు.

గ్రామ సర్పంచ్ సరోజ్ అగర్వాల్ కి వచ్చిన ఐడియాని పంచాయతీ అధికారులు అమలులో పెట్టారు. సరోజ్ అగర్వాల్ తన సొంత డబ్బుతో డ్రోన్ కొనుగోలు చేసి దాన్ని పంచాయతీకి అప్పగించారు. పంచాయతీ అధికారులు ఆ డ్రోన్‌ ద్వారా పెన్షన్‌ డబ్బుని భుత్కాపడని గ్రామానికి పంపించారు. నేరుగా సత్నామీ ఇంటికి తీసుకెళ్లి డ్రోన్, ఆ డబ్బుని అందించింది. హితారామ్‌ సత్నామీ ఆనందానికి అవధులు లేవు. 2 కిలోమీటర్ల ప్రయాణ భారం తప్పిందని అంటున్నాడు సత్నామీ. ఇకపై ప్రతినెలా డ్రోన్‌ సాయంతో అతడికి పెన్షన్‌ అందజేయాలని నిర్ణయించారు అధికారులు.

Tags:    
Advertisement

Similar News