'ఒక్క రోజు సీబీఐని నా చేతికి ఇస్తే.. బీజేపీలో సగం మంది జైల్లో ఉంటారు'

కేంద్రంలోని నరేంద్ర మోడీ అత్యంత స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారని అందరూ బావిస్తున్నారు. కానీ ఒక్క రోజు నా చేతికి ఈడీ, సీబీఐని ఇవ్వండి.. సగం మంది బీజేపీ నాయకులు జైల్లోనే ఉంటారని కేజ్రివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Update:2022-11-25 06:38 IST

గుజరాత్ అసెంబ్లీ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్దం పెరిగిపోతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావాలని తప్పుడు కేసులు బనాయిస్తూ ఆప్ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తమ పార్టీ నాయకులపై ఇప్పటి వరకు 167 కేసులు పెట్టారని, కానీ ఏ ఒక్క దర్యాప్తు సంస్థ కూడా మేం తప్పు చేసినట్లు నిరూపించలేక పోయిందని ఆయన అన్నారు. కనీసం కోర్టులో కూడా ఈ విషయంలో ఎలాంటి పురోగతి సాధించలేదని చెప్పారు.

గత ఏడేళ్లలో పెట్టిన 167 కేసుల్లో దాదాపు 150 కేసుల నుంచి ఆప్ నాయకులు బయటపడ్డారని కేజ్రివాల్ చెప్పారు. దర్యాప్తు సంస్థలకు చెందిన 800 మంది అధికారులను కేవలం ఆప్ నాయకుల కోసమే బీజేపీ ప్రభుత్వం వాడుతోందని ఆయన ఆరోపించారు. అయినా సరే ఒక్క తప్పు కూడా బయటపడలేదని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ అత్యంత స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారని అందరూ భావిస్తున్నారు. కానీ ఒక్క రోజు నా చేతికి ఈడీ, సీబీఐని ఇవ్వండి.. సగం మంది బీజేపీ నాయకులు జైల్లోనే ఉంటారని కేజ్రివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ గత ఆరు నెలలుగా జైల్లోనే ఉంటున్నారు. ఈడీ ఆయనపై మనీ లాండరింగ్ కేసు బనాయించింది. ఇక డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా పేరును ఢిల్లీ లిక్కర్ స్కాంలోకి సీబీఐ లాగింది. పార్టీ కమ్యునికేషన్ ఇంచార్జ్ విజయ్ నాయర్‌ను ఈడీ కస్టడీలోకి తీసుకున్నది. ఇవన్నీ రాజకీయ కక్షతో పెట్టిన కేసులే అని కేజ్రివాల్ చెప్పుకొచ్చారు. తమ చేతుల్లో దర్యాప్తు సంస్థలు ఉన్నాయని ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి రాజకీయ ప్రత్యర్థులను బీజేపీ భయభ్రాంతులకు గురి చేస్తోందని కేజ్రివాల్ అన్నారు.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ 230 సీట్లు గెలుచుకుంటుందని కేజ్రివాల్ జోస్యం చెప్పారు. బీజేపీకి 20 సీట్లు కూడా రావని ఆయన అన్నారు. గుజరాత్‌లో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకం ఉందని చెప్పారు. అభివృద్ధిని కోరుకునే వాళ్లు ఆప్‌కు ఓటేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీరు కనుక బీజేపీకి ఓటేస్తే వాళ్లు ఐదేళ్లు నాతో పోరాడటానికే టైం వేస్ట్ చేస్తారని అన్నారు. గత ఐదేళ్లలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు తమ ప్రభుత్వం రూ. 1 లక్ష కోట్లు ఇచ్చిందని.. కానీ ఆ సొమ్మంతా ఏమయ్యిందో అర్థం కావడం లేదన్నారు.

తమ ప్రభుత్వం ఉచిత పథకాలు అందిస్తోందని, అది మంచిది కాదని మోడీ అంటున్నారు. నేను ఉచిత పథకాలు ఇస్తున్నాను, మోడీ కూడా ఉచితాలు ఇస్తున్నారు. ఆయన ఇచ్చేది ధనికుల కోసం అయితే.. నేను ప్రజల కోసం ఇస్తున్నానని కేజ్రివాల్ చెప్పారు. ఎవరికీ తెలియకుండా లక్షల కోట్ల రుణాలను ఆయన మాఫీ చేస్తున్నారు. ఇది ఉచితాలు కావా మోడీజీ అని ప్రశ్నించారు. మంచి పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించడం ఉచితాల కిందకు రావని ఆయన చెప్పారు.

Tags:    
Advertisement

Similar News