విద్యార్థినులు స్నానాలు చేస్తుండగా వీడియోలు...8 మంది ఆత్మహత్యా యత్నం, ఒకరి మృతి !
విద్యార్థినులు స్నానాలు చేస్తుండగా వీడియోలు తీసి తన స్నేహితుడి సహాయంతో వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసింది తోటి విద్యార్థిని. ఈ విషయం తెలిసిన 8 మంది బాధితులు ఆత్మహత్యాయత్నం చేయగా ఒకరు మరణించినట్టు సమాచారం.
పంజాబ్ మొహాలీలోని చండీగఢ్ విశ్వవిద్యాలయంలో దారుణం జరిగింది. ఓ విద్యార్థిని తోటి విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారంలో పెట్టింది. ఇది తెలుసుకున్న బాధిత విద్యార్థినిలు ఆత్మహత్యకు పాల్పడగా, ఒకరు మృతి చెందారని సమాచారం.
యూనివర్సిటీలోని లేడీస్ హాస్టల్ లో ఓ విద్యార్థిని కొంత కాలంగా బాత్ రూముల్లో స్నానాలు చేస్తున్న తోటి విద్యార్థినిల వీడియోలు తీస్తూ సిమ్లాలో ఉన్న తన స్నేహితుడికి పంపిస్తూ ఉంది. అతను ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. ఇలా 60 మంది విద్యార్థినుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిన్న రాత్రి ఈ విషయం బాధిత విద్యార్థునులకు తెలిసింది. దాంతో వ్వాళ్ళు షాక్ కు గురయ్యారు. బాధితుల్లో 8 మంది విద్యార్థినిలు ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే వారిని వెంటనే ఆస్పత్రికి తరలించడంతో రక్షించగలిగామని, అందులో ఒక విద్యార్థిని చనిపోయినట్టు ఇతర విద్యార్థినిలు చెప్తున్నారు.
కాగా దీనిపై కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా కళాశాల యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. పైగా ఈ విషయాన్ని బైటికి చెప్పొద్దని అధికారులు తమపై ఒత్తిడి తెస్తున్నారని విద్యార్థినులు మండిపడుతున్నారు. వీడియోలు తీసిన విద్యార్థిని వాటిని లీక్ చేయకుండా ఉండటం కోసం బాధితుల నుండి డబ్బు డిమాండ్ చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.
ఈ విషయం అర్దరాత్రి బైటపడటంతో యూనివర్సిటీ విద్యార్థులు భగ్గున మండిపోయారు. రాత్రి నుంచే నిరసన ప్రదర్శనలకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు యువతుల అభ్యంతరకర వీడియోలు తీసిన యువతిని అరెస్టు చేశారు.
ఇదిలా ఉండగా ఈ ఘటన కారణంగా పలువురు బాలికలు ఆత్మహత్యకు ప్రయత్నించారన్నవార్తలను పోలీసులు, యూనివర్శిటీ అధికారులు ఖండించారు. అవన్నీ పుకార్లని, బాధిత బాలికలలో ఒకరు స్పృహ తప్పి పడిపోయి ఆసుపత్రి పాలైనట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
ఈ విషయంపై స్పందించిన పంజాబ్ విద్యా శాఖ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్, శాంతిభద్రతలను కాపాడాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. "చండీగఢ్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులందరూ ప్రశాంతంగా ఉండవలసిందిగా నేను వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను, దోషులు ఎవరూ తప్పించుకోలేరు. ఇది చాలా సున్నితమైన విషయం. ఇది మన సోదరీమణులు, కుమార్తెల గౌరవానికి సంబంధించినది. మీడియాతో సహా మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది మనకు పరీక్షా సమయం కూడా. " అని ఆయన ట్వీట్ చేశారు.