మోదీ కఠినమైన వ్యక్తి అనుకున్నా.. కానీ ఆయ‌న మానవతావాది

కాంగ్రెస్ పార్టీ డాక్టర్ దగ్గర కాకుండా, కాంపౌండర్ వద్ద చికిత్స తీసుకుంటోందని ఎద్దేవా చేశారు గులాంనబీ ఆజాద్.

Advertisement
Update:2022-08-29 17:12 IST

కాంగ్రెస్ పార్టీ డాక్టర్ దగ్గర కాకుండా, కాంపౌండర్ వద్ద చికిత్స తీసుకుంటోందని ఎద్దేవా చేశారు గులాంనబీ ఆజాద్. పార్టీకి రాజీనామా చేస్తూ రాసిన లేఖలో రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టిన ఆయన, ఇప్పుడు పార్టీని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూలిపోడానికి సిద్ధంగా ఉందని, పార్టీ పునాదులు బాగా బలహీనపడిపోయాయని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకత్వానికి లోపాలను సరిదిద్దుకునే సమయం కూడా ఇప్పుడు లేదన్నారు. ప్రస్తుతం పార్టీలో ఉన్నవారంతా ఎందుకూ పనికిరారంటూ కాస్త ఘాటుగా మాట్లాడారు. పార్టీ సభ్యులను ఏకం చేయాల్సిన కీలక నేతలు, వారంతా పార్టీని వదిలిపెట్టి వెళ్లేలా చేస్తున్నారని అన్నారు.

బలవంతంగా పార్టీని వదిలిపెట్టా..

తనకు ఇష్టం లేకపోయినా, తాను బలవంతంగా కాంగ్రెస్‌ని వీడేలా చేశారని, ఆ పార్టీలో ప్రజాస్వామ్యం పూర్తిగా అడుగంటిపోయిందని అన్నారు ఆజాద్. జి-23 కూటమితో కలసి అధిష్టానానికి లేఖ రాసిన సందర్భంలో తాను 6 రోజులపాటు నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. పార్టీపై ప్రేమతో తాము లేఖరాశామని, అప్పటి నుంచే తమను టార్గెట్ చేశారని అన్నారు. అధినాయకత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదనేది అక్కడి సిద్ధాంతమని, దాని కోసం పార్టీని సైతం ముంచేస్తారని విమర్శించారు. తన ఇంట్లో నుంచి తానే బలవంతంగా వెళ్లిపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాహుల్‌కి ఆసక్తి లేదు..

30 ఏళ్ల క్రితం సోనియా గాంధీపై ఎలాంటి గౌరవం ఉందో ఇప్పుడూ ఆమెను అలాగే గౌరవిస్తానని చెప్పారు ఆజాద్. గాంధీ కుటుంబ వారసుడిగా, రాజీవ్‌-సోనియా కుమారుడిగా రాహుల్‌ను కూడా అంతే గౌరవిస్తామన్నారు. రాహుల్‌ గాంధీని విజయవంతమైన నాయకుడిగా చూడాలనే కోరిక తమకు ఉందని, కానీ ఆ ఆసక్తి రాహుల్‌కి లేదన్నారు.

బీజేపీతో నాకేం లాభం..

తాను ప్రస్తుతం కాశ్మీర్ రాజకీయాలపై ఫోకస్ పెట్టానని, అలాంటి సందర్భంలో బీజేపీతో తనకు ఉపయోగం ఏముంటుందని చెప్పారు ఆజాద్. బీజేపీలోకి వెళ్తున్నారన్న వార్తల్ని కొట్టిపారేశారు. కానీ మోదీపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ కఠినమైన వ్యక్తి అనుకున్నానని, కానీ ఆయన మానవతావాది అని కొనియాడారు. తాను బీజేపీలోకి వెళ్తున్నానంటూ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News