టీమిండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌

ప్రతి భారతీయుడిని గౌరవంగా తలెత్తుకునేలా చేయడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమితులైన గంభీర్‌ తెలిపారు.

Advertisement
Update:2024-07-10 08:08 IST

ఎట్టకేలకు టీమిండియా ప్రధాన కోచ్‌ పదవిపై క్లారిటీ వచ్చింది. గౌతమ్‌ గంభీర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించినట్టు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా మంగళవారం వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా తెలియజేశారు. క్రికెట్‌ కెరీర్‌లో గంభీర్‌కు ఉన్న అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియన్‌ క్రికెట్‌ను ఆయన మరింత ముందుకు తీసుకెళతారన్న నమ్మకం తనకుందన్నారు. బీసీసీఐ నుంచి ఆయనకు అన్ని విధాలా సహకారం అందుతుందని చెప్పారు. రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం టీ20 ప్రపంచకప్‌ ముగిసిన అనంతరం కంప్లీట్‌ కావడంతో ఆయన స్థానంలో కొత్త కోచ్‌గా గంభీర్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. సహాయక కోచ్‌ ఎంపిక విషయంలో కూడా బీసీసీఐ గంభీర్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలుస్తోంది.


అదే నా ముందున్న లక్ష్యం : గంభీర్‌

ప్రతి భారతీయుడిని గౌరవంగా తలెత్తుకునేలా చేయడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమితులైన గంభీర్‌ తెలిపారు. మంగళవారం ఆయన ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. భారతదేశమే నా గుర్తింపు. నా దేశానికి సేవ చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా.. ఇప్పటివరకు వేరే క్యాప్‌ పెట్టుకున్నా.. రాజకీయాల్లోకి వెళ్లినా.. మళ్లీ సొంతగూటికి రావడం గర్వంగా ఉంది.. అని వివరించారు. 1.4 కోట్ల మంది భారతీయుల కలలను నీలం రంగు జెర్సీలు ధరించిన ఆటగాళ్లు మోస్తున్నారని, అందరి కలలను నిజం చేయడానికి తన శక్తిమేరకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News