ఆ నీళ్లు తాగడానికి పనికిరావు
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని గంగాజలానికి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించిన అక్కడి పీసీబీ
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని గంగాజలానికి సంబంధించిన కీలక విషయాలను అక్కడి కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. ఆ నీళ్లు తాగడానికి పనికి రావని, కేవలం భక్తుల స్నానాలకే ఉపయోగించవచ్చని పేర్కొన్నది. ప్రతి నెల 8 ప్రాంతాల్లో నీటి నాణ్యతపై పరీక్షలు నిర్వహిస్తామని.. అందులోభాగంగా హరిద్వార్‌లోని నీళ్లు 'బి' కేటగిరిలో ఉన్నట్లు గుర్తించాని వెల్లడించింది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నీటి నాణ్యతను ఐదు తరగతులుగా విభజించింది. నాలుగు పారామీటర్‌ల (పీహెచ్, ఆక్సిజన్, బయోలాజికల్ ఆక్సిజన్, కోలిఫాం బ్యాక్టీరియా) ఆధారంగా హరిద్వార్‌లో నీటిని 'బి' కేటగిరీలో ఉన్నట్లు కనుగొన్నాం. ఈ నీళ్లు తాగడానికి పనికిరావు. భక్తులు స్నానాలు చేయడానికి ఉపయోగించవచ్చు అని యూకే పీసీసీ అధికారి రాజేంద్రసింగ్ తెలిపారు. మరోవైపు నీటి కాలుష్యంపై స్థానిక పూజారి ఉజ్వల్ పండిట్ ఆందోళన వ్యక్తం చేశారు. మానవ వ్యర్థాలే గంగాజల స్వచ్ఛతను దెబ్బతీస్తున్నాయన్నారు. ఇదిలాఉంటే ఢిల్లీలోని యమునా నదిలోనూ కాలుష్యం కోరలు చాస్తున్నది. నీటి కాలుష్యం వల్ల నదిలో విషపూరిత నురుగు ప్రవహిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఈ క్రమంలోనే హరిద్వార్‌లోని గంగా జలంలోనూ నాణ్యత లేకపోవడం గమనార్హం.