సిద్ధుని చంపినోళ్లు.. జైలులో కొట్టుకు చచ్చారు

హత్యలు, బ్లాక్ మెయిలింగ్, కిడ్నాప్ కేసుల్లో సహనిందితులుగా ఉన్న ఆ ముగ్గురు జైలులో ఒకరినొకరు కొట్టుకున్నారంటే ఎవరూ నమ్మడంలేదు. వారిలో వారు గొడవపడి చంపుకునేంత కక్షలు వారి మధ్య లేవని అంటున్నారు.

Advertisement
Update:2023-02-27 08:51 IST

పంజాబ్ జైలులో ముగ్గురు ఖైదీలు ఒకే బ్యారక్ లో ఉన్నారు. ఆ ముగ్గురు గ్యాంగ్ స్టర్లు. ఒకే తరహా నేరాలు చేశారు. ఒక హత్య కేసులో కామన్ ముద్దాయిలు. అలాంటి ఆ ముగ్గురు ఉన్నట్టుండి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అందులో ఇద్దరు చనిపోయారు. ఒకడు ప్రాణాలతో మిగిలాడు, తీవ్ర గాయాలతో అతడి పరిస్థితి విషమంగా ఉంది. అచ్చు సినిమా స్టోరీలా ఉన్న ఈ ఘటన పంజాబ్ లోని తర్న్ తరణ్ జిల్లాలోని సెంట్రల్ జైలులో జరిగింది. జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు గ్యాంగ్ స్టర్లు మరణించారని పోలీసులు తెలిపారు.

ఆషామాషీ గ్యాంగ్ స్టర్లు కాదు..

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సిద్ధూ మూసేవాలా హత్య జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ గాయకుడైన సిద్ధూ మూసేవాలా హత్యకు పంజాబ్ లో గ్యాంగ్ వార్ కి సంబంధం ఉందని తేలింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు గోల్డీ బ్రార్.. సిద్ధూ హత్యకు తానే కారణమని అంగీకరించాడు. మూసేవాలాను హత్య చేసిన కేసులో నిందితులైన మన్‌ దీప్ తూఫాన్, మన్మోహన్ సింగ్, కేశవ్‌ లు గోయింద్వాల్ సాహిబ్ జైలులో ఉన్నారు. జైలులో జరిగిన గ్యాంగ్ వార్ లో ఆ ముగ్గురు ఒకరిపై ఒకరుదాడి చేసుకున్నారు. మన్మోహన్ సింగ్, మన్ దీప్ తూఫాన్ జైలులోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన కేశవ్‌ ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

హత్యలు, బ్లాక్ మెయిలింగ్, కిడ్నాప్ కేసుల్లో సహనిందితులుగా ఉన్న ఆ ముగ్గురు జైలులో ఒకరినొకరు కొట్టుకున్నారంటే ఎవరూ నమ్మడంలేదు. వారిలో వారు గొడవపడి చంపుకునేంత కక్షలు వారి మధ్య లేవని అంటున్నారు. అయితే సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత పంజాబ్ లో గ్యాంగ్ స్టర్ల ఘాతుకాలు ఒక్కొక్కటే వెలుగులోకి వచ్చాయి. విదేశాల్లో ఉంటూ, పంజాబ్ లో కిడ్నాప్ లు చేయిస్తూ గ్యాంగ్ స్టర్లు పెద్ద మొత్తాల్లో డబ్బులు గుంజేవారని, ఇదంతా పెద్ద మాఫియాగా తయారైందనే ఆరోపణలున్నాయి. ఇలాంటి వారిని జైలులో వేస్తున్నా, బెయిల్ పై బయటకు రావడం, అంతకంటే పెద్ద ఘోరాలు చేయడం.. పోలీసులకు తలనొప్పిగా మారింది. సిద్దూ మూసేవాలా హత్య తర్వాత పంజాబ్ పోలీసులపై మరిన్ని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడీ జైలు మరణాలు ఈ ఎపిసోడ్ లో పెద్ద ట్విస్ట్ గా మారాయి.

Tags:    
Advertisement

Similar News