గేమ్ పాస్ వర్డ్ చెప్పలేదని స్నేహితుడి హత్య.. నిందితులంతా మైనర్లే..

ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన పూర్ణిమ కుమారుడు పాపాయి దాస్ (18)కు నలుగురు స్నేహితులు ఉన్నారు. వారందరూ మైనర్లే. పాపాయి దాస్ కు ఆన్‌లైన్ మొబైల్ గేమ్ అయిన ఫ్రీ ఫైర్ ఆడే అలవాటు ఉంది.

Advertisement
Update:2024-01-19 14:49 IST

సినిమాల ప్రభావం వల్లో, సమాజంలో వచ్చిన మార్పుల వల్లో గానీ మనుషుల్లో నేర ప్రవృత్తి రోజురోజుకూ పెరుగుతోంది. సర్దుకుపోయే తత్వం, ఆప్యాయత, అనుబంధం వంటివి ఈ తరం వారిలో తగ్గిపోతున్నాయి. చిన్నచిన్న విషయాలకే గొడవలు పడటం జరుగుతోంది. హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఆన్‌లైన్ మొబైల్ గేమ్(ఫ్రీ ఫైర్) పాస్ వర్డ్ షేర్ చేయడానికి నిరాకరించినందుకు ఒక యువకుడిని అతడి నలుగురు స్నేహితులు హత్య చేశారు. హత్యకు పాల్పడిన నలుగురూ మైనర్లు కావడం కలకలం రేపుతోంది. ఆ నలుగురు యువకులు తమ స్నేహితుడిని చంపడమే కాదు కాల్చి ఆధారాలు లేకుండా చేసేందుకు కూడా ప్రయత్నించారు.

ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన పూర్ణిమ కుమారుడు పాపాయి దాస్ (18)కు నలుగురు స్నేహితులు ఉన్నారు. వారందరూ మైనర్లే. పాపాయి దాస్ కు ఆన్‌లైన్ మొబైల్ గేమ్ అయిన ఫ్రీ ఫైర్ ఆడే అలవాటు ఉంది. అయితే ఈ గేమ్ పాస్ వర్డ్ షేర్ చేయాలని ఇటీవల అతడి నలుగురు స్నేహితులు కోరారు. అయితే అందుకు పాపాయిదాస్ నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన నలుగురు స్నేహితులు పాపాయిదాస్ ను కొట్టి చంపారు.

ఆ తర్వాత స్నేహితుడి మృతదేహాన్ని సమీపంలోని అడవికి తీసుకెళ్లారు. అక్కడ అతడి మృతదేహాన్ని దహనం చేశారు. పాపాయి దాస్ కనిపించకుండా పోవడంతో అతడి తల్లి పూర్ణిమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈనెల 15న అడవిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై ఉన్న టాటూలను బట్టి చనిపోయింది తన కుమారుడేనని పూర్ణిమ నిర్ధారించింది. అనుమానంతో పాపాయి దాస్ స్నేహితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. విచారణలో తామే పాపాయి దాస్ ను హత్య చేసినట్లు అంగీకరించారు. ఆన్‌లైన్ గేమ్ పాస్ వర్డ్ చెప్పలేదని హత్యకు పాల్పడినట్లు వారు చెప్పారు. హత్యకు పాల్పడిన నలుగురు మైనర్లను ఇవాళ పోలీసులు జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డులో హాజరు పరిచారు.

Tags:    
Advertisement

Similar News