అదానీ గ్రూప్ తో ఫ్రెంచ్ కంపెనీ కటీఫ్..!
అదానీ గ్రూప్ 5,000 కోట్ల డాలర్లతో తలపెట్టిన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు భవిష్యత్తు ఇప్పుడు సందిగ్దంలో పడింది. ఈ ప్రాజెక్టు ఈక్విటీలో 25 శాతం వాటా తీసుకునేందుకు అంగీకరించిన ఫ్రెంచి కంపెనీ ‘టోటల్ ఎనర్జీస్’ పునరాలోచనలో పడింది.
హిండెన్ బర్గ్ ఆరోపణలతో అదానీ గ్రూప్ కి జరిగిన, జరుగుతున్న డ్యామేజీ అంతా ఇంతా కాదు. ఇప్పటికే అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో జారుడుమెట్లపైనుంచి పడిపోతున్నారు. దేశీయంగా అదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇక అంతర్జాతీయంగా కూడా అదానీ బ్రాండ్ వేల్యూ పూర్తిగా తగ్గిపోయింది. గతంలో అదానీ గ్రూప్ తో వ్యాపార భాగస్వామ్యం కోసం ఎదురు చూసిన విదేశీ కంపెనీలు సైతం ఇప్పుడు వెనక్కి వెళ్లిపోతున్నాయ. తాజాగా ఫ్రెంచ్ కంపెనీ ‘టోటల్ ఎనర్జీస్’ అదానీతో జరిగిన ఒప్పందానికి కటీఫ్ చెప్పేసింది.
అది తేలిన తర్వాతే..
అదానీ గ్రూప్ 5,000 కోట్ల డాలర్లతో తలపెట్టిన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు భవిష్యత్తు ఇప్పుడు సందిగ్దంలో పడింది. ఈ ప్రాజెక్టు ఈక్విటీలో 25 శాతం వాటా తీసుకునేందుకు అంగీకరించిన ఫ్రెంచి కంపెనీ ‘టోటల్ ఎనర్జీస్’ పునరాలోచనలో పడింది.
అదానీ గ్రూప్ కంపెనీల ఆడిట్ వ్యవహారం తేలే వరకు ఈ ప్రాజెక్టుపై సంతకాలు చేయకూడదని నిర్ణయించింది. ఈమేరకు ఇన్వెస్టర్లు అడిగిన ప్రశ్నలకు టోటల్ ఎనర్జీస్ గ్రూప్ సీఈఓ ప్యాట్రిక్ పొయానే క్లారిటీగా సమాధానమిచ్చారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ పై ఇప్పుడప్పుడే సంతకాలు పెట్టలేమని చెప్పేశారు.
హిండెన్‌బర్గ్ సంస్థ అదానీ గ్రూప్ పై చేసిన ఆరోపణల నేపథ్యంలో, ప్రత్యేక ఆడిట్ ప్రారంభించామని.. అందులో స్పష్టత వచ్చాకే హైడ్రోజన్ ప్లాంటులో భాగస్వామిగా చేరడంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు టోటల్ ఎనర్జీస్ సీఈఓ ప్యాట్రిక్.
అదానీ గ్రూప్ లో టోటల్ ఎనర్జీస్ కు 3.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి. హైడ్రోజన్ ప్లాంటులో కూడా టోటల్ ఎనర్జీస్ భాగస్వామ్యం కోరుకుంది. 25శాతం వాటాలు తీసుకునేందుకు గత ఏడాది జూన్‌లో టోటల్ ఎనర్జీస్ ప్రకటించింది.
అయితే హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో వ్యవహారం తారుమారైంది. అదానీ గ్రూప్ అంటేనే విదేశీ కంపెనీలు భయపడిపోతున్నాయి. ఆల్రడీ అందులో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కూడా కొత్త ఒప్పందాల విషయంలో వెనకడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ విషయంలో అదానీ గ్రూప్ కి కటీఫ్ చెప్పేస్తోంది ఫ్రెంచ్ కంపెనీ టోటల్ ఎనర్జీస్.