బీహార్ లో నలుగురు విదేశీయులకు కరోనా..
జలుబు, దగ్గుతో బాధపడుతున్న 33 మందిని పరీక్షించగా అందులో నలుగురికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. వారంతా ఇంగ్లాండ్, మయన్మార్ నుంచి వచ్చారు.
భారత్ లో మరోసారి కరోనా భయాల నేపథ్యంలో విదేశాలనుంచి వచ్చేవారిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రత్యేకించి చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్ లాండ్ నుండి వచ్చే ప్రయాణీకులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేసింది కేంద్రం. అయితే మిగతా దేశాలనుంచి వచ్చేవారిపై కూడా విమానాశ్రయ సిబ్బంది ఓ కన్నేసి ఉంచుతున్నారు. అనుమానితులు కనపడితే ముందు వైద్య పరీక్షలకు తీసుకెళ్తున్నారు. తాజాగా బీహార్ వచ్చిన నలుగురు విదేశీయులకు కరోనా సోకినట్లు తేలింది. గయ విమానాశ్రయంలో దిగిన వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. వారిలో నలుగురికి పాజిటివ్ అని తేలింది.
గయకు పోటెత్తుతున్న విదేశీయులు.
బౌద్ధ గురువు దలైలామా నెల రోజుల పాటు బోధ్ గయలో ఉంటారు. దీంతో ఆయన్ను కలిసేందుకు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆ ప్రాంతానికి వస్తున్నారు. ఈ క్రమంలో వైద్య వర్గాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. గయ ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ వంటి పలు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాయి. జలుబు, దగ్గుతో బాధపడుతున్న 33 మందిని పరీక్షించగా అందులో నలుగురికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. వారంతా ఇంగ్లాండ్, మయన్మార్ నుంచి వచ్చారు. ముగ్గురిని గుర్తించి గయలో ఐసోలేషన్ లో ఉంచారు. మరో వ్యక్తి ఆచూకీ దొరకలేదు, అతను ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడి వైద్య వర్గాలను గయ అధికారులు అప్రమత్తం చేశారు.
చైనా నుంచే తొలి కేసు..
భారత్ లో కరోనా అలర్ట్ ప్రకటించిన తర్వాత మొదటగా నమోదైన కేసు చైనా నుంచి వచ్చిన వ్యక్తి కావడం విశేషం. చైనా నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రాయానికి చేరుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆ వ్యక్తిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, ఐసోలేషన్ లో ఉంచారు. అతని నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. ఆ కేసుకి అదనంగా ఇప్పుడు బీహార్ లో మరో నాలుగు కేసులు బయటపడ్డాయి. వీటి సంఖ్య మరింత పెరుగుతుందనే అంచనాలున్నాయి. చైనాతోపాటు బ్రెజిల్, అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో కొత్త వేరియంట్ జాడ కనిపించకపోయినా, విదేశాలనుంచి వచ్చేవారితోనే ప్రమాదం పొంచి ఉందనే అనుమానాలున్నాయి. భారత్ చేపట్టిన ముందస్తు చర్యలు సఫలమవుతాయా, నిజంగానే భారతీయులు హెర్డ్ ఇమ్యూనిటీని సాధించారా, కొత్త వేరియంట్ కి మన వ్యాక్సిన్లు గట్టి సమాధానం చెబుతాయా.. అనేది ముందు ముందు తేలిపోతుంది.