ఐపీఎల్ చరిత్రలో ధోనీ లాంటి నాయకుడు లేడు.. రాడు.. - గవాస్కర్
క్లిష్టమైన పరిస్థితుల నుంచి కూడా ఎలా బయటపడాలో చెన్నై జట్టుకు తెలుసని ఆయన తెలిపారు. ధోనీ కెప్టెన్సీలో మాత్రమే అది సాధ్యమని స్పష్టంచేశారు
క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. ఐపీఎల్ చరిత్రలో ధోనీ లాంటి కెప్టెన్ లేడని, భవిష్యత్తులో ఇక రాడని ఆయన కొనియాడారు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో విజయవంతంగా జట్టును ముందుకు నడిపించిన ధోనీ, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా కొనసాగుతూ ఆ జట్టును విజయాల బాటలో నడిపిస్తున్నాడన్నారు.
ఇంకెవరికీ సాధ్యం కాని.. మరో క్రికెటర్ ఎప్పటికీ అందుకోలేని ఘనతను ధోనీ రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో అందుకున్నాడు. ఈ మ్యాచ్‌తో ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి ఘనత అందుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
ఈ నేపథ్యంలోనే గవాస్కర్ ధోనీ ని ప్రశంసించాడు. క్లిష్టమైన పరిస్థితుల నుంచి కూడా ఎలా బయటపడాలో చెన్నై జట్టుకు తెలుసని ఆయన తెలిపారు. ధోనీ కెప్టెన్సీలో మాత్రమే అది సాధ్యమని స్పష్టంచేశారు. 200 మ్యాచ్‌లకు సారథిగా ఉండటం చాలా కష్టమని, అన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించడం చాలా భారం కూడా అని ఆయన అభిప్రాయపడ్డారు. అది కెప్టెన్ ఆటపైనా ప్రభావం చూపుతుందని తెలిపారు. కానీ, ధోనీ మాత్రం వేరు అని, అతను భిన్నమైన కెప్టెన్ అని ప్రశంసలు కురిపించారు. ధోనీ లాంటి నాయకుడు లేడు.. భవిష్యత్తులో అతని లాంటి కెప్టెన్ ఎప్పటికీ ఉండడు కూడా అని గవాస్కర్ కొనియాడారు.