ఢిల్లీని కప్పేసిన పొగమంచు..రైళ్ల రాకపోకలకు అంతరాయం
మంచు దట్టంగా కురుస్తూ.. 100 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలూ కనిపించని పరిస్థితి
చలి తీవ్రతతో ఉత్తర భారతం గజగజలాడుతున్నది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతోత దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కప్పేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున 9.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచు దట్టంగా కురుస్తూ.. 100 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలూ కనిపించని పరిస్థితి నెలకొన్నది. అటు గాలి నాణ్యతా సూచీ 334గా నమోదైంది. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
పొగ మంచు కారణంగా ఢిల్లీలో పలు వాహనాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రాజధానికి వెళ్లి, వచ్చే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అటు విమాన సర్వీసులపై ఢిల్లీ ఎయిర్‌పోర్టు ప్రకటన జారీ చేసింది. క్యాట్-3 లేని విమాన సర్వీసులకు ఆటంకం కలగొచ్చని పేర్కొన్నది. ప్రయాణికులకు విమానాల రాకపోకల గురించి ఆయా సంస్థలను సంప్రదించాలని సూచించింది.
అటు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లోనూ ఇదే విధమైన పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూకశ్మీర్‌లో హిమపాతం దట్టంగా కురుస్తున్నది. హిమపాతం కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రోడ్లను మూసివేశారు. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.