IPC అవుట్.. ఇకపై BNS సెక్షన్.. ఫస్ట్ FIR ఎక్కడంటే!
కొత్త చట్టాలు ఆదివారం రాత్రి నుంచి అమల్లోకి రాగా.. దేశ రాజధాని ఢిల్లీలో తొలి కేసు నమోదైంది. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ వీధి వ్యాపారిపై BNS సెక్షన్ 285 కింద పోలీసులు FIR నమోదు చేశారు.
భారత న్యాయవ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS), భారతీయ సాక్ష్య అధినియమమ్ (BNA) అమల్లోకి వచ్చాయి. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ (IPC), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రోసిజర్, ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్త చట్టాలను తీసుకువచ్చింది కేంద్రం.
సత్వర న్యాయాన్ని అందించేందుకు కొత్త చట్టాలు తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. కొత్త చట్టాల్లో వయస్సు, నేరాలకు సంబంధించి మార్పులు జరిగాయి. కొత్త చట్టాల ప్రకారం విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా తీర్పు ఇవ్వాలి. మొదటి విచారణ జరిగిన నాటి నుంచి 60 రోజుల్లోగా అభియోగాలు నమోదు చేయాలని కొత్త చట్టాలు పేర్కొంటున్నాయి. ఇక మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి కొత్త అధ్యాయాన్ని చేర్చారు. కొత్త చట్టాల ప్రకారం చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది. ఇంతకుముందు చిన్నారులపై అత్యాచారాలకు సంబంధించి ఐపీసీలో ప్రత్యేకమైన సెక్షన్లు లేకపోవడంతో గందరగోళం ఏర్పడేది. ఇక కొత్త చట్టాలతో ఏ వ్యక్తి అయినా పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్‌లో అయినా జీరో FIR నమోదు చేసే అవకాశం కల్పించారు.
కొత్త చట్టాలు ఆదివారం రాత్రి నుంచి అమల్లోకి రాగా.. దేశ రాజధాని ఢిల్లీలో తొలి కేసు నమోదైంది. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ వీధి వ్యాపారిపై BNS సెక్షన్ 285 కింద పోలీసులు FIR నమోదు చేశారు. రోడ్డుపై వాటర్ బాటిళ్లు, గుట్కా, బీడీ, సిగరెట్లు అమ్మడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాడని FIRలో పేర్కొన్నారు. సదరు వీధి వ్యాపారి బిహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.