రెజ్లర్లకు రైతుల బాసట.. మోదీ తల వంచక తప్పదా..?

రెజ్లర్ల ఆందోళన విషయంలో కూడా రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోనట్టే ఉంది. ఒత్తిడి పెరిగితే తప్ప కేంద్రం దిగిరాదంటున్నారు రైతు సంఘాల నేతలు.

Advertisement
Update:2023-05-08 20:17 IST

ప్రధాని మోదీ మెడలు వంచి నల్ల చట్టాలను వెనక్కు తీసుకునేలా చేసిన ఘన చరిత్ర రైతులది. అదే ఊపుతో వారు మరోసారి ఢిల్లీలో అడుగు పెట్టారు. బ్యారికేడ్లను దాటుకుని జంతర్ మంతర్ కు చేరుకున్నారు. ఈసారి భారత రెజ్లర్లకు వారు బాసటగా నిలిచారు. పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ కు చెందిన రైతు నేతలు ఆదివారం నాటికి ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఉదయం వారు జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల దీక్షా శిబిరంలో జాయిన్ అయ్యారు, పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకోవాలని చూసినా, రైతు సంఘాల నేతల్ని ఆపలేకపోయారు. సాయంత్రానికల్లా రెజ్లర్లతో కలసి భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు రైతు సంఘాల నేతలు. వారికి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.

భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ ని పదవినుంచి తొలగించాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక దాడికి పాల్పడ్డారని మహిళా రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి తాత్సారం చేస్తున్నారు. అటు బీజేపీ నేతలు కూడా ఆయన్ను వెనకేసుకు వస్తున్నారు. దీనిపై రెజ్లర్లు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఇటీవల పోలీసులు ఆందోళనకారుల్ని అడ్డుకునే క్రమంలో రెజ్లర్లపై కూడా లాఠీలు ఝళిపించారు. తమకు గాయాలయ్యాయని రెజ్లర్లు కంటతడి పెట్టారు. రైతు సంఘాల నేతలు ఈ వ్యవహారంలోకి ఎంటర్ కావడంతో కేంద్రంలో భయం మొదలైంది.

రైతు చట్టాల విషయంలో వెనక్కు తగ్గేది లేదన్న మోదీ.. చివరకు తల వంచక తప్పలేదు. ఇప్పుడు రైతు సంఘాల నేతలు రెజ్లర్లకోసం తరలి వచ్చారు. దీంతో బ్రిజ్ భూషణ్ రాజీనామా తప్పదనే అంచనాలు వెలువడుతున్నాయి. గతంలో ప్రతిపక్షాలు మద్దతిచ్చినా, రైతులు ఒకే తాటిపై నిలబడి కేంద్రాన్ని ఎదిరించారు, చివరకు మెడలు వంచారు. ఇప్పుడు రెజ్లర్ల ఆందోళన విషయంలో కూడా రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోనట్టే ఉంది. ఒత్తిడి పెరిగితే తప్ప కేంద్రం దిగిరాదంటున్నారు రైతు సంఘాల నేతలు. రెజ్లర్లతో కలసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News