'మాకు తెలంగాణ మోడల్ కావాలి'.... బెంగళూరులో రైతుల ప్రదర్శన
తెలంగాణలో అమలవుతున్న పథకాలను తమకు కూడా అమలు చేయాలని కోరుతూ కర్నాటకలో రైతులు ప్రదర్శన నిర్వహించారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేయాలని, రైతులకు ఉచిత నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటినీ తమకు కూడా అమలు చేయాలంటు కర్నాటక రాజధాని బెంగళూరులో రైతులు ప్రదర్శన నిర్వహించారు.
వివిధ రైతు సంఘాల నాయకత్వంలో అనేక వందల మంది రైతులు మెజెస్టిక్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని రాష్ట్ర అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లి నిరసన చేపట్టారు. వీరు తమకు తెలంగాణ పథకాలు కావాలనే డిమాండ్ తోపాటు చెరకు పంటకు కనీస మద్దతు ధరను కూడా కోరారు. ఈ ఆందోళనకు మద్దతు తెలుపుతూ తమిళనాడు, కర్నాటక, ఇతర రాష్ట్రాల నుంచి రైతులు కూడా ర్యాలీలో పాల్గొనేందుకు మెజెస్టిక్ రైల్వే స్టేషన్‌కు తరలివచ్చారు. అయితే వారందరినీ రైల్వే స్టేషన్‌లో పోలీసులు అరెస్టు చేశారు.
వ్యవసాయ ఉత్పత్తులు, యంత్రాలపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని, విద్యుత్తు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలనే డిమాండ్లతో దక్షిణ భారత రైతు సమాఖ్య 'చలో విధాన సౌధ' కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా రైతులు కర్నాటక, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసించారు. తెలంగాణలో అమలు చేస్తున్నట్టు కర్నాటక ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేయాలని, రైతులకు ఉచిత నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
'రైతు బంధు' పెట్టుబడి మద్దతు, రైతు బీమా కవరేజీ, వ్యవసాయ రంగానికి ఉచిత నిరంతర విద్యుత్ సహా తెలంగాణ మోడల్ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ప్లకార్డులు చేతపట్టారు. 'మాకు రైతు బంధు కావాలి', 'మాకు జీవిత బీమా కావాలి', 'మాకు తెలంగాణ మోడల్ పథకాలు కావాలి' అనే నినాదాలతో కూడిన ప్లకార్డులను తమిళనాడు, కర్ణాటక రైతులు పట్టుకున్నారు.
కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు తమ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, తెలంగాణలో చేసినట్లుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని కర్ణాటక రైతులు డిమాండ్ చేశారు.
''తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దార్శనిక నాయకత్వం, రైతు అనుకూల చర్యలు పొరుగు రాష్ట్రాల రైతులను ఎలా ఆకట్టుకుందో ఇది స్పష్టంగా తెలియజేస్తోంది'' అని బెంగళూరు నిరసనలో పాల్గొన్న రైతు సమాఖ్య నాయకుడు, ఖమ్మం రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర్‌రావు అన్నారు.
ఈ నిరసనలో ఫెడరేషన్ నాయకులు కోటపాటి నరసింహం నాయుడు, పికె దైవసిగమణి, కె రామగౌడ్, కె శాంత కుమార్, ఎఎస్ బాబుతో పాటు ఉత్తర భారత రైతు నాయకులు శివకుమార్ కక్కాజి, దల్లేవాల్ తదితరులు పాల్గొన్నారు.