ఆరేళ్ళలో రెట్టింపు అయింది రైతుల ఆదాయం కాదు..అప్పులే!

2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించి ఆరేళ్ళయ్యింది. కానీ నిజానికి జరుగుతున్నది మాత్రం అందుకు పూర్తి విరుద్దం. ఈ ఆరేళ్ళలో రైతుల అప్పులు రెట్టింపు అయ్యాయని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి.

Advertisement
Update:2022-08-24 13:23 IST

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చి ఆరేళ్లు పూర్తయింది. ఈ ఆర్థిక సంవత్సరం కూడా ప్రారంభమై ఆరు నెలలు. కానీ క్షేత్ర స్థాయిలో రైతుల ప‌రిస్థితులు, అధికారిక గణాంకాలు మాత్రం ప్ర‌భుత్వ వాగ్దానానికి ఎంతోదూరం ఉన్న‌ట్టు వెల్ల‌డిస్తున్నాయి. ఈ ఆరేళ్ళ‌లో రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు గానీ అప్పులు మాత్రం రెట్టింప‌య్యాయి. వ్య‌వ‌సాయం రాష్ట్రానికి సంబంధించిన అంశం. కేంద్రం నిధులు అందించ‌డం వ‌ర‌కే ప‌రిమితం. అమ‌లు చేసే బాధ్య‌త రాష్ట్రాల‌దే అంటూ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం. " 2022-23 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామ‌ని 2016లో చెప్పిన ప్రధాని న‌రేంద్ర‌మోడీ ఇప్పుడు 75వ స్వాతంత్య్ర‌ సంవత్సరంలో తన కానుకగా రైతులకు రుణ భారాన్ని రెట్టింపు చేశారు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంపైననే కాక‌ ఇది అమలైన‌ రాష్ట్రాల పేర్లను తెల‌పాల‌ని పార్లమెంటులో అనేక సార్లు స‌భ్యులు ప్ర‌శ్నించారు. ప్రతిసారీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలో 2016 ఏప్రిల్‌లో అంతర్ మంత్రిత్వ కమిటీ ఏర్పాటు చేశామ‌ని ప్ర‌భుత్వం చెప్పిందే త‌ప్ప నిర్దిష్ట‌మైన జ‌వాబేదీ ఇవ్వ‌లేదు. ఈ కమిటీ (డ‌బులింగ్ ఫార్మ‌ర్స్ ఇన్ కం-డిఎఫ్ఐ) సెప్టెంబరు 2018లో తుది నివేదికను ఇచ్చింది, ఈ కమిటీ సూచ‌న‌ల మేర‌కు రైతుల ఆదాయాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పెంపొందించడానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు, సంస్కరణలు,విధానాలను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొనేది. వ్యవసాయం రాష్ట్రానికి సంబంధించినది కాబట్టి, అన్ని పథకాలు, కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలు అవుతాయి. అధిక బడ్జెట్ కేటాయింపులు, బడ్జెటేతర ఆర్థిక వనరులు, కార్పస్ ఫండ్‌లను అందించ‌డం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాలకు మద్దతు ఇస్తుందని స‌రిపెడుతోంది.

నిరుపేద రైతుల‌కు ఉప‌యోగ‌ప‌డ‌ని ప‌థ‌కాలు

"దేశంలో 86 శాతం మంది చిన్న రైతులు పెట్టుబడి పెట్టలేని స్థితిలో ఉన్నారు. వీరి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం మాకు చాలా ముఖ్యం" అని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇటీవ‌ల అన్నారు. సులభంగా రుణాలు పొందలేని, మార్కెట్‌కు అందుబాటులో లేని రైతులు వీళ్ళేనని సామాజిక కార్యకర్తలు(యాక్టివిస్టులు) పేర్కొంటున్నారు. ఈ రైతులు స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకుని తమ ఉత్పత్తులను సమీపంలోని వ్యాపారికి విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యవసాయ సంఘాలు చెబుతున్నాయి. వారి సంపాదన అవసరాలు తీర్చుకోవడానికి సరిపోనందున, తిరిగి స‌కాలంలో అప్పులు చెల్లించ‌లేక‌పోవ‌డంతో మ‌రింత అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సి వ‌స్తోంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు 2022-23లో రూ. 1,32,513.62 కోట్లకు పెంచారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. అయితే వీటి వ‌ల్ల రైతులకు క‌లిగిన అసలు ప్రయోజనాలేంటని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

"గ‌తంలో ప్ర‌జ‌లు ఆహారం కోసం ఎక్కువ మొత్తాలు వెచ్చించేవారు కానీ నేడు విద్య‌, ఆరోగ్యం వంటి వాటికి పెద్ద మొత్తాలు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంది. రైతుల గురించి ఆరోగ్యం, విద్య‌, బీమా కు సంబంధించి ఏ చ‌ర్య‌లూ తీసుకోడంలేదు. అదేమంటే.. క్రాప్ ఇన్సూరెన్స్ అని ప్ర‌భుత్వం చెబుతోంది. ఎంత‌మంది రైతుల‌కు ఈ ప‌రిహారం అందిందో చెప్ప‌మ‌నండి రైతుల‌ను" అని 'స్వాభిమాన్ షేట్కారి సంఘ‌ట‌న‌' వ్య‌వ‌స్థాప‌కుడు రాజు షెట్టి అన్నారు.

ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్ బివై) కింద 7.6 కోట్ల మంది రైతులు రూ. 90,927 కోట్లకు పైగా క్లెయిమ్‌లను అందుకున్నారని అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన పథకం, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పిఎంకఎఎస్ వై), కౌలు రైతులకు వర్తించదు. వ్యవసాయం చేసేది పేద రైతులైతే వ్యవసాయం చేయని భూస్వాములే ఈ అగ్రి స్కీమ్‌ల ప్రయోజనాలు పొందుతున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇంకా, కిసాన్ క్రెడిట్ కార్డ్‌లు, వ్యవసాయ పంటలతో పాటు పాడి,మత్స్యకారులకు ఉత్పత్తి రుణాలను అందజేస్తున్నాయని, వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ రుణభారాన్ని మరింత పెంచుతున్నాయని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.

రైతుల రుణ భారం పెరిగిపోతోంద‌ని నేష‌ఫన‌ల్ శాంపిల్ స‌ర్వే సంస్థ చెబుతోంటే.. రైతుల ఆదాయం నిరంత‌రం పెరుగుతూ రెట్టింపు ఆదాయం కంటే ఎక్కువే సంపాదిస్తున్నారంటూ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర వాద‌న ఏంటంటే.. గ‌త ఏప్రిల్ నెల‌లో నీతి అయోగ్ స‌భ్యుడు ర‌మేష్ చాంద్ మాట్లాడుతూ.. ప్ర‌భుత్వం తెచిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాలు ఉప‌సంహ‌రించుకోవ‌డం పెద్ద దెబ్బ. ఆ చ‌ట్టాలు అమ‌ల‌యిన‌ట్ల‌యితే 2022 నాటికి ఖ‌చ్చితంగా రైతుల ఆదాయం రెట్టింపు చేయాల‌న్న ల‌క్ష్యం నెర‌వేరేద‌ని వ్యాఖ్యానించ‌డం హాస్యాస్ప‌ద‌మ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

అక్టోబ‌ర్ లో క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర పై రైతు ఉద్య‌మం!

రాజు శెట్టి మరికొందరు రైతు నాయకులతో కలిసి అక్టోబర్ ప్రారంభంలో మూడు రోజులపాటు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర పై 'ఎంఎస్ పి హామీ కిసాన్ మోర్చా' నిర్వ‌హించాల‌ని యోచిస్తున్నారు. ఢిల్లీ శివార్లలో జరిగే ఈ సమావేశానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి 200 పైగా సంస్థలు హాజరవుతాయని పేర్కొన్నారు. వివిధ రైతు సంస్థలుఎప్ప‌టినుంచో క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను చట్టబద్ధం చేయాలని కోరుతున్నాయి, ప్రస్తుతం కొన్ని పంటలను మాత్రమే ఎంఎస్‌పీ కింద కొనుగోలు చేస్తున్నారు. చాలా కొద్ది రాష్ట్రాల‌లో మాత్ర‌మే ఫంక్షనల్ మండిస్ లేదా అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ యార్డులు ఉన్నాయి.

పెరుగుతున్న అభద్రతా భావం

2017-18లో, పంపిణీ చేసిన వ్యవసాయ రుణం రూ. 11.6 లక్షల కోట్లు కాగా ఏప్రిల్ 1, 2021 నుండి మార్చి 31, 2022 మధ్య లోన్ మొత్తం రూ. 17.1 లక్షల కోట్లుగా ప్రభుత్వ డేటా చెబుతోంది. భారతదేశంలోని వ్యవసాయ కుటుంబానికి బకాయి ఉన్న రుణాల సగటు మొత్తాన్ని రూ.74,121గా మంత్రి ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఈ మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో ఆరు అంకెలు (లక్షలు) కంటే ఎక్కువగా ఉందన్నారు. వ్య‌వ‌సాయ‌కుటుంబానికి రుణం స‌గ‌టున రాష్ట్రాల వారీగా.. ఆంధ్రప్రదేశ్ - రూ. 2,45,554, హర్యానా రూ. 1,82,922, కర్ణాటక రూ. 1,26,240, కేరళ రూ. 2 ,42,482, పంజాబ్ రూ. 2,03,249, రాజస్థాన్ రూ. 1,13,865, తమిళనాడు రూ. 1,06,553, తెలంగాణ లో రూ. 1,52,113 గా ఉందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో ఏ ఒక్క రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయలేదని పేర్కొంది. "కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్వంత నిర్ణయాల ప్రకారం వారి స్వంత వనరుల నుండి వ్యవసాయ రుణాల మాఫీని ప్రకటిస్తాయి. లబ్ధిదారుల డేటా మొదలైనవి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల వద్ద మాత్రమే ఉంటాయి" అని మంత్రి పేర్కొన్నారు.

రుతుపవనాలు సరిగా లేకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడం వరి దిగుబడిపై ఆందోళన కలిగిస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌లో ధరలు విపరీతంగా పెరుగుతాయనే భయం నెలకొంది. వరి సాగు విస్తీర్ణం దాదాపు 15 శాతం పడిపోయింది. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలలో వరి విస్తీర్ణం త‌గ్గింద‌ని నివేదిక‌లు చెబుతున్నాయి.

బియ్యం సేకరణ స్థితిగతులపై సమీక్షించేందుకు కేంద్రం సమావేశం ఏర్పాటు చేసింది. వరి ఉత్పత్తి చేసే రాష్ట్రాల ప్రతినిధులతో ఆగస్టు 30న సమావేశం జరగనుంది. ఈ స‌మావేశంలోనే మ‌ద్ద‌తు ధ‌ర‌, రుణ మాపీ త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌ను ప్ర‌తినిధులు లేవ‌నెత్త‌నున్నారు.

Tags:    
Advertisement

Similar News