టెలికం డిపార్ట్‌మెంట్ పేరుతో ఫేక్ కాల్స్.. జర జాగ్రత్త
టెలికం శాఖ పేరుతో కొందరు నకిలీ కాల్స్ చేస్తున్నారు.. మొబైల్ నంబరు నిలిపేస్తామంటూ బెదిరిస్తున్నారు. టెలికం ఉన్నతాధికారులమంటూ విదేశాల నుంచి వాట్సప్ కాల్స్ చేస్తున్నారు.
టెలికం డిపార్ట్‌మెంట్ పేరుతో నకిలీ కాల్స్ వస్తున్నాయని, అలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెలి కమ్యూనికేషన్ విభాగం వినియోగదారులను అప్రమత్తం చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కాబట్టి మీ ఫోన్ నంబరును డిస్‌కనెక్ట్ చేస్తామని కాల్ వస్తే అది కచ్చితంగా నకిలీ కాలేనని, అలాంటి వాటిపట్ల వెంటనే తమకు కంప్లయింట్ చేయాలని సూచించింది.
ఆన్‌లైన్ మోసాలకు ఆస్కారం
టెలికం శాఖ పేరుతో కొందరు నకిలీ కాల్స్ చేస్తున్నారు.. మొబైల్ నంబరు నిలిపేస్తామంటూ బెదిరిస్తున్నారు. టెలికం ఉన్నతాధికారులమంటూ విదేశాల నుంచి వాట్సప్ కాల్స్ చేస్తున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ ద్వారా వినియోగదారులను కంగారుపెట్టి వారి పర్సనల్ డేటా తస్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా తీసుకున్న వివరాలతో ఆన్‌లైన్ మోసాలకు పాల్పడే ఎత్తులు వేస్తున్నారు. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని టెలికం శాఖ సూచించింది.
సంచార్ సాథీలో ఫిర్యాదు చేయండి
ఇలాంటి కాల్స్ వస్తే వినియోగదారులు టెలికం శాఖ వారి సంచార్ సాథీ పోర్టల్ (www. sancharsathi.gov.in)లో ఫిర్యాదు చేయాలని సూచించింది. ఇప్పటికే ఇలాంటి సైబర్ మోసాల బారిన పడితే 1930 నంబర్‌కు ఫోన్ చేసి కంప్లయింట్ చేయాలంది.