విస్మృతవీరుడు త్రైలోక్యనాథ్ చ‌క్రవర్తి.. వీరసావర్కర్‌లా ఆయ‌న క్ష‌మాభిక్ష కోరుకోలేదు..

బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీసే క్రమంలో చక్రవర్తి పంజాబ్, బొంబాయి ప్రెసిడెన్సీ, యునైటె డ్ ప్రావిన్సెస్, బెంగాల్లోని వివిధ ప్రాంతాలలో పర్యటించారు.

Advertisement
Update:2022-08-10 17:11 IST

త్రైలోక్యనాథ్ చ‌క్రవర్తి పేరు ఈతరం వారికి తెలిసి ఉండదు. ఎందుకంటే వీరసావర్కర్‌తోపాటు ఆయన అండమాన్ జైలులో ఉన్నా, బ్రిటిష్‌వారి హయాంలో మొత్తం 30 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభ‌వించినా ఒక్కసారి కూడా తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని మహజర్లు పెట్టుకోలేదు. అలాంటి పని చేసి ఉంటే ఆయన పేరు తెలిసేది. ఆయననూ వీరుడు అనేవారు. త్రైలోక్యనాథ్ 30 ఏళ్ల జైలు జీవితంలో ఆరేళ్లు అండమాన్‌లోని సెల్యులర్‌ జైలులో గడిపారు.

ఆయనను "మహారాజ్" అనేవారు. అవిభక్త బెంగాల్‌లో ఆయన 1889 ఆగస్టు 2న మైమెన్సింగ్‌ జిల్లాలో జన్మించారు. 1905లో బెంగాల్‌ విభజన తరవాత స్వదేశీ ఉద్యమంతో స్ఫూర్తి పొంది 17 ఏళ్ల వయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలోకి దూకారు. 1906లో ఢాకా అనుశీలన్‌ స‌మితిలో చేరి క్రియాశీలంగా పనిచేశారు. ఢాకా అనుశీలన్‌ స‌మితి వ్యవస్థాపక అధ్యక్షుడు పులిన్‌ బెహారీ దాస్‌ను 1910లో ఢాకా కుట్ర కేసులో అరెస్టు చేసిన తరవాత ప్రతుల్ చంద్ర గంగూలీతో కలిసి ఆ సంస్థను వలసవాదాన్ని వ్యతిరేకించే బలమైన సంస్థగా దిద్దితీర్చారు.

చక్రవర్తిని మొట్టమొదటిసారి 1908లో అరెస్టు చేసి ఆరు నెలలు జైలులోపెట్టారు. దానితో ఆయన చదువుమానేయాల్సి వచ్చింది. ఆయన భారత ఉపఖండంలో అంటే దేశవిభజనకు ముందు దేశంలోని అనేక జైళ్లలో శిక్షఅనుభవించారు. పోలీసు జవానును హత్య చేశాడన్నఆరోపణతో 1912లో మరోసారి అరెస్టు చేశారు. కానీ సాక్ష్యం దొరకక వదిలిపెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మనదేశానికి చెందిన సైనికులను బ్రిటిష్‌ పోలీసులపైకి రెచ్చగొడ్తున్నారన్నఆరోపణతో 1914లో మళ్లీ అరెస్టు చేశారు. చక్రవర్తి, గంగూలీతో పాటు 42 మంది మీద కేసు మోపారు. అప్పుడు పదేళ్ల శిక్ష పడింది.

బరిసాల్, ప్రెసిడెన్సీ జైళ్లలో కొంతకాలం ఉన్నతరవాత త్రైలోక్యనాథ్‌ను 1916లో అండమాన్ జైలుకు తరలించారు. అక్కడ ఆయన చిత్రహింసలు భరించారు. అయినా ఆయన విప్లవ స్ఫూర్తి ఇసుమంత కూడా తగ్గలేదు. కిరాతకమైన చిత్రహింసలకు, దుర్భర పరిస్థితులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని అండమాన్ జైలులో ఉన్న ఖైదీలు నిర్ణయంచారు. కానీ ఈ నిరసనకారుల్లో అతివాదులు, మితవాదులు అని రెండు వర్గాలు ఏర్పడ్డాయి. సావర్కర్‌ సోదరులు మితవాదవర్గంలో ఉన్నారు. వారికి అధికారులు కొంత ఊరట కలిగించారు. ఆ రకంగా వాళ్లు జైలు సూపరింటెండెంటుకు సన్నిహితులైపోయారు. తమకు దక్కిన ప్రయోజనాలను వదులుకోవడం ఇష్టంలేక పోరాటంలో పాల్గొనడానికి నిరాకరించారు.

చక్రవర్తి బలహీనంగా ఉన్నానిరాహారదీక్ష చేశారు. ఆయనకు ఉబ్బసం కూడా ఉండేది. ఏడేళ్ల తరవాత 1921లో ఆయనను బెంగాల్‌లోని అలిపూర్కేంద్ర కారాగారానికి మార్చి మరో మూడేళ్ల తరవాత విడుదల చేశారు. విడుదలైన తరవాత కొంతకాలం దక్షిణ కలకత్తాలోని జాతీయ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. కానీ వేతనం తీసుకునేవారుకాదు. ఆ సమయంలోనే విప్లవోద్యమానికి నిధుల కోసం త్రైలోక్యనాథ్‌ దొంగ నోట్లు కూడా ముద్రించాలనుకున్నారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

1924 చివరలోత్రైలోక్యనాథ్‌ను మళ్లీ అరెస్టు చేసి బర్మాలోని మాండలే జైలుకు పంపించారు. అప్పుడు సుభాష్‌ చంద్రబోస్ కూడా అదే జైలులో ఉన్నారు. నాలుగేళ్ల తరవాత త్రైలోక్యనాథ్‌ విడుదలయ్యారు. కలకత్తా కాంగ్రెస్‌ మ‌హాసభలో పాల్గొన్నారు. అక్కడే భగత్‌సింగ్‌ ప‌రిచ‌య‌మ‌య్యారు. సాండర్స్‌ను హత్య చేసిన కేసులో భగత్‌సింగ్‌ అప్పటికే తప్పించుకుని తిరుగుతున్నారు.

భగత్‌సింగ్‌ నెలకొల్పిన హిందుస్థాన్ నేషలిస్టు రిపబ్లిక‌న్ అసోసియేషన్‌కు త్రైలోక్యనాథ్‌ సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఆ తరవాత రెండేళ్లకు 1930లో చిట్ట‌గాంగ్ ఆయుధ దాడి కేసులో మళ్లీ అరెస్టయ్యారు. 1930 నుంచి 1938 మధ్య చక్రవర్తిని అనేక జైళ్లకు తిప్పి 1939లో విడుదల చేశారు. విడుదలైన వెంటనే బ్రిటిష్‌ సైన్యంలోని భారతీయుల చేత దేశవ్యాప్తంగా తిరుగుబాటు చేయించడానికి ఉపక్రమించారు. అయిదోసారి జైలుకెళ్లిన తరవాత జైలులో సోషలిస్టు సాహిత్యం చదివారు. విడుదలైన తరవాత ఓ కమ్యూనిస్టు పార్టీ నెలకొల్పాలనుకున్నారు. త‌రువాతి కాలంలో సుభాష్ చంద్ర‌బోస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు.

బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీసే క్రమంలో చక్రవర్తి పంజాబ్, బొంబాయి ప్రెసిడెన్సీ, యునైటె డ్ ప్రావిన్సెస్, బెంగాల్లోని వివిధ ప్రాంతాలలో పర్యటించారు. ఆ క్రమంలో ఆర్.ఎస్.ఎస్. వ్యవస్థాపకుడు హెగ్డేని, హిందూ మహాసభ నాయకుడు సావర్కర్ అన్న గణేష్ సావర్కర్‌ను కూడా కలుసుకున్నారు. కానీ వారిద్ద‌రూ బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా ఏ పని చేయడానికైనా నిరాకరించారు. అప్పుడు త్రైలోక్యనాథ్‌ ప్ర‌యత్నాలు ఫలించలేదు. కానీ ఆయన పోరు ఆపలేదు. తూర్పు బెంగాల్ వెళ్లి ఢాకా అనుశీలన్‌ స‌మితిని పునర్నిర్మించడానికి ప్రయత్నించి ఆరోసారి అరెస్టయ్యారు. 1940 నుంచి 1946 వ‌ర‌కు జైలులో ఉన్నారు.

దేశ విభజన తరవాత త్రైలోక్యనాథ్‌ తూర్పు పాకిస్తాన్(ప్రస్తుత బంగ్లాదేశ్)లోని తన స్వస్థలంలో ఉండాలనుకున్నారు. అక్కడ సోషలిస్టు పార్టీ నెలకొల్పారు. 1954లో చట్టసభకు ఎన్నికయ్యారు. అయూబ్‌ఖాన్‌ సైనిక పాలనలో సోషలిస్టు పార్టీని నిషేధించారు. ఆ తరవాత త్రైలోక్యనాథ్ స్వగ్రామంలో ఉండిపోయారు.

Tags:    
Advertisement

Similar News