ఫ్యాక్ట్ చెక్: గవర్నర్‌గా ఉన్నప్పుడు సత్యపాల్ మాలిక్, పుల్వామా దాడి, అవినీతి అంశాలను లేవనెత్తలేదన్న అమిత్ షా వ్యాఖ్యల్లో నిజముందా?

మాలిక్ కు గవర్నర్ గా పదవీ కాలం ముగిసిన తర్వాతనే ఆయన మనస్సాక్షి ఎందుకు మేల్కొంది అని అమిత్ షా ప్రశ్నించారు. ఆయనకు తిరిగి పదవి ఇవ్వలేదు కాబట్టే ఆరోపణలు చేస్తున్నాడనే అర్థం వచ్చేట్టుగా అమిత్ షా మాట్లాడారు. అయితే అమిత్ షా చేస్తున్న ఈ ఆరోపణల్లో నిజముందా? గవర్నర్ గా ఉన్నప్పుడు సత్యపాల్ మాలిక్ ఈ అంశాలను మాట్లాడలేదా ?

Advertisement
Update:2023-04-26 12:50 IST

జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మోడీ సర్కార్ పై చేస్తున్న ఆరోపణలతో సర్కార్ డిఫెన్స్ లో పడిపోయింది. పుల్వామా దాడి కి సర్కార్ దే బాధ్యత అంటూ ఆయన చేసిన ఆరోపణలు, ఆరెస్సెస్ నాయకుడు రాం మాధవ్ తనకు 300 కోట్ల రూపాయలు లంచం ఇవ్వజూపాడన్న ఆరోపణలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు అవినీతిమయమయ్యాంటూ చేస్తున్న దాడి బీజేపీ పెద్దలకు నిద్రపట్టనివ్వడం లేదు.

ఈ నేపథ్యంలో సత్యపాల్ మాలిక్ పై కేంద్ర హోం మంత్రి, బీజేపీ లో నెంబర్-2 అయిన అమిత్ షా ప్ర‌త్యారోప‌ణ‌లు చేశారు. మాలిక్ కు గవర్నర్ గా పదవీ కాలం ముగిసిన తర్వాతనే ఆయన మనస్సాక్షి ఎందుకు మేల్కొంది అని అమిత్ షా ప్రశ్నించారు. ఆయనకు తిరిగి పదవి ఇవ్వలేదు కాబట్టే ఆరోపణలు చేస్తున్నాడనే అర్థం వచ్చేట్టుగా అమిత్ షా మాట్లాడారు.

అయితే అమిత్ షా చేస్తున్న ఈ ఆరోపణల్లో నిజముందా..? గవర్నర్ గా ఉన్నప్పుడు సత్యపాల్ మాలిక్ ఈ అంశాలను మాట్లాడలేదా..? మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా గొంతెత్తలేదా..?

నిజాలేంటో ఒకసారి చూద్దాం..

1. ఫిబ్రవరి 14, 2019 న పుల్వామా ఉగ్రదాడి జరిగింది. అప్పటికి సత్యపాల్ మాలిక్ జమ్మూకశ్మీర్ గవర్నర్ గా ఉన్నారు. దాడి జరిగిన తర్వాతి రోజు ఫిబ్రవరి 15, 2019న ఆయన ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ దాడి కొంతవరకు ఇంటెలిజెన్స్ వైఫల్యం ఫలితంగా జరిగిందని, ప్రత్యేకించి పేలుడు పదార్థాలు నిండిన వాహనం కదలికను ఇంటెలిజెన్స్, భద్రతా దళాలు ముందుగా గుర్తించలేకపోయాయని చెప్పారు. “మేము దానిని (ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని) అంగీకరించాలి. హైవేపై పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని మేము గుర్తించలేకపోయాము. తనిఖీ చేయలేకపోయాము. మాది కూడా తప్పు అని అంగీకరించాలి” అని మాలిక్ అన్నారు.

మాలిక్ ఇలా మాట్లాడిన‌ కొన్ని నెలల తర్వాత, నవంబర్ 2019లో ఆయన‌ను గోవాకు గవర్నర్‌గా మార్చారు. ఆ తర్వాత ఆగస్టు 2020లో అతన్ని మేఘాలయకు గవర్నర్ గా నియమించారు.


2. అక్టోబర్, 2021లో రాజస్థాన్‌లోని జుంజునులో జరిగిన ఓ బహిరంగ సభలో మాలిక్ మాట్లాడుతూ, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ చేయించడం కోసం ఫైల్ క్లియర్ చేయాలంటూ తనకు లంచం ఇవ్వజూపారని ఆయన చెప్పారు. RSS నాయకుడు రాంమాధవ్ తన దగ్గరికొచ్చి ఆ ఫైల్ క్లియర్ చేస్తే 300 కోట్ల రూపాయలు ఇస్తానన్నాడని ఆయన ఆ బహిరంగ సభలో చెప్పారు. ఆ తర్వాత అక్టోబర్ 22, 2021 ది వైర్ కోసం కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మాలిక్ ఇవే ఆరోపణలను పునరుద్ఘాటించారు.

దీని తర్వాత ఈ విషయంలో సీబీఐ రెండు కేసులు నమోదు చేసి ఏప్రిల్ 2022లో 14 చోట్ల సోదాలు నిర్వహించింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ (RGIC), చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (CVPPPL) అధికారులపై సీబీఐ కేసులు కూడా బుక్ చేసింది.

3. అక్టోబరు 26, 2021న ఇండియా టుడే టీవీ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్ , గోవాలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతి మయమైపోయిందని మాట్లాడారు. ప్రతి రంగంలో అవినీతి తాండవిస్తోందని ఆయన ఆరోపించారు. దీని గురించి తాను ప్రధానమంత్రికి చెప్పానని, కానీ ఆయన ఏమీ చేయలేదని పైగా నన్ను గవర్నర్ పదవి నుంచి తొలగించారని చెప్పారు.

4. జనవరి 2022లో, సత్యపాల్ మాలిక్ హర్యానాలోని దాద్రీలో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ.. రైతుల ఆందోళన గురించి చర్చించడానికి తాను కలిసినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ చాలా అహంకారంగా వ్యవహరించారని చెప్పారు.

"అతను చాలా అహంకారంతో ఉన్నాడు. మన‌ సొంత రైతులు 500 మంది చనిపోయారని, ఒక కుక్క చనిపోయినప్పుడు కూడా మీరు సంతాప లేఖ పంపారని నేను అతనితో చెప్పినప్పుడు 'వారు నా కోసం చనిపోయారా?' అని మోడీ అడిగారు అని మాలిక్ అన్నారు. ఈ విషయం మాట్లాడినప్పుడు మాలిక్ మేఘాలయ గవర్నర్ గా ఉన్నారు.

5. అతను మేఘాలయ గవర్నర్‌గా ఉన్నప్పుడే మళ్ళీ సెప్టెంబర్ 15, 2022న ప్రసారమైన ఒక ఇంటర్వ్యూలో ది వైర్‌తో మాట్లాడుతూ, ''ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక మెగాలోమానియాక్, అది ఒక రోగం'' అని అన్నారు. అమిత్ షా "ప్రాక్టికల్ మనిషి, కానీ మోడీ అతనికి స్వేచ్ఛ ఇవ్వడు" అని ఆయన అన్నారు, ''నితిన్ గడ్కరీ కి దేశవ్యాప్తంగా భారీ ఆదరాభిమానాలున్నాయి. అయితే అతనికి, రాజ్‌నాథ్ సింగ్‌కు ఎటువంటి క్రెడిట్ లభించదు. వారు ఏమి చేసినా క్రెడిట్ అంతా మోడీకి మాత్రమే దక్కుతుంది.'' అని ఆ ఇంటర్వ్యూలో మాలిక్ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News