ఎన్నో నదులు ఉన్నా..మహారాష్ట్రకు సాగు నీరు అందడకపోవడం బాధకరం : సీఎం కేసీఆర్

తెలంగాణ మోడల్ పాలనే ఎజెండాగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ జరగాలని సూచించారు. రాష్ట్రంలోని 288 నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని చెప్పారు.

Advertisement
Update:2023-06-09 07:57 IST

మహారాష్ట్రలో జల వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఎన్నో నదులు రాష్ట్రంలో పారుతున్నా.. అక్కడి ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించడంలో విఫలమవడం బాధకరమని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర ప్రజలకు కూడా తెలంగాణ పథకాలు అందించాలనే స్పూర్తితోనే బీఆర్ఎస్ పని చేస్తోందని.. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పార్టీని ఆదరిస్తున్న తీరు సంతోషకరమని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..

తెలంగాణ మోడల్ పాలనే ఎజెండాగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ జరగాలని సూచించారు. రాష్ట్రంలోని 288 నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని చెప్పారు. ప్రతీ గ్రామంలో అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో 9 కమిటీలను ఏర్పాటు చేయాలని నాయకులను ఆదేశించారు. తెలంగాణలో రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలు, బుక్‌లెట్స్, పోస్టర్స్, హోర్డింగ్స్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని కేసీఆర్ అన్నారు. సోషల్ మీడియాను కూడా విస్తృతంగా ఉపయోగించుకోవాలని కేసీఆర్ సూచించారు.

ఎంతో మంది నాయకులు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అయ్యారు. కానీ మహారాష్ట్ర ప్రజలను మాత్రం ఎవరూ పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ధరణి పోర్టల్ తీసుకొని వచ్చి రెవెన్యూ రికార్డులను అన్నింటినీ డిజిటలైజేషన్ చేశామని చెప్పారు. కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి.. రైతులకు పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్, ఉచిత సాగునీరు వంటి పథకాల వల్ల వ్యవసాయ రంగం ఎంతగానో అభివృద్ధి చెందిందని సీఎం కేసీఆర్ చెప్పారు.

కేసీఆర్ సమక్షంలో ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ సుభాష్ రాథోడ్, సేనా సంఘటన్‌కు చెందిన ఉమేష్ చవాన్, బీజేపీ పార్టీకి చెందిన సివిల్ ఇంజనీర్ దీపక్ పవార్, భారత్ పవార్, అకోలా బజార్ ఉప సర్పంచ్ అశోక్ రాథోడ్, ఉపాధ్యాయ్ సంఘటన్ యావత్మాల్ జిల్లాకు చెందిన అజయ్ రాథోడ్, బీజేపీ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రకాశ్ రాథోడ్, శివసేన సర్కిల్ ప్రముఖుడు రాజేశ్ పవార్, శివసేన షిండే వర్గానికి చెందిన పర్వీన్ చవాన్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Tags:    
Advertisement

Similar News