అధిక పెన్షన్ దరఖాస్తులకు మరింత సమయం.. - గడువు పొడిగిస్తున్నట్టు ఈపీఎఫ్‌వో వెల్లడి
అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో దరఖాస్తుల కోసం ఈపీఎఫ్‌వో ఫిబ్రవరిలో మార్గదర్శకాలు జారీ చేసింది.
వేతన జీవులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ఈపీఎఫ్‌వో ప్రకటించింది. అధిక పెన్షన్ కోసం ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు చేసేవారికి గడువు పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఈ గడువు మే మూడో తేదీతో ముగియనుండగా, దానిని జూన్ 26 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు టెక్నికల్ సమస్యలు ఎదురవడం, కచ్చితంగా జత చేయాల్సిన ఈపీఎఫ్‌వో పాస్‌బుక్‌కు సర్వర్ మొరాయించడం వంటి కారణాల వల్ల అర్హులైన పెన్షనర్లు, కార్మికులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తమకు మరింత గడువు ఇవ్వాలంటూ వారు ఈపీఎఫ్‌వో కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ఈపీఎఫ్‌వో తాజా నిర్ణయం తీసుకుంది.
అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో దరఖాస్తుల కోసం ఈపీఎఫ్‌వో ఫిబ్రవరిలో మార్గదర్శకాలు జారీ చేసింది. మే మూడో తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని తెలిపింది. ఏప్రిల్‌లో ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ సర్వర్ పనిచేయకపోవడం, పింఛనుదారులకు పేర్లలో అక్షర పొరపాట్లు, పీపీవో ఆధార్ అనుసంధానం కాకపోవడం వంటి కారణాలతో దరఖాస్తుల్లో జాప్యం జరిగింది.
ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తుకు నాలుగు నెలల సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు తన తీర్పు సందర్భంగా సూచించింది. అయినా ఈపీఎఫ్‌వో రెండు నెలలు మాత్రమే సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరో రెండు నెలలు గడువు ఇవ్వాలని పలు కార్మిక సంఘాలు కేంద్ర కార్యాలయానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో ఈపీఎఫ్‌వో గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.