ఇబ్బందులున్నా విద్యుత్ కార్లదే హవా.. టార్గెట్ 2030

విద్యుత్ వాహనాలు ఆశించిన స్థాయిలో రోడ్లపై పరుగులు తీయడం లేదు. కారణాలు చాలానే ఉన్నా, వాటన్నిటినీ ఆధిగమించి 2030నాటికి విద్యుత్ కార్లు ఎక్కువగా భారత్ రోడ్లపైకి వస్తాయని సర్వేలు చెబుతున్నాయి.

Advertisement
Update:2022-12-11 07:11 IST

పెట్రోల్, డీజిల్ కార్లతో పోల్చి చూస్తే విద్యుత్ వాహనాల వినియోగంతో ఇంధన ఖర్చు పూర్తిగా తగ్గిపోతుంది. పైగా విద్యుత్ వాహనాల ధరలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ, ఇతరత్రా ఖర్చులు కూడా చాలా తక్కువ. కానీ విద్యుత్ వాహనాలు ఆశించిన స్థాయిలో రోడ్లపై పరుగులు తీయడం లేదు. కారణాలు చాలానే ఉన్నా, వాటన్నిటినీ ఆధిగమించి 2030నాటికి విద్యుత్ కార్లు ఎక్కువగా భారత్ రోడ్లపైకి వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. మరో ఎనిమిదేళ్లలో ఆ అద్భుతం జరుగుతుందని, కొత్తగా అమ్ముడయ్యే కార్లలో సగానికి సగం విద్యుత్ కార్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

విద్యుత్ వాహనాల వినియోగం, ఆవశ్యకతపై తాజాగా జరిగిన సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. 28 నుంచి 40ఏళ్ల వయసు ఉన్న వారినుంచి ఈ సర్వే కోసం అభిప్రాయాలు సేకరించారు. వీరంతా విద్యుత్ కార్లు వినియోగించేవారు, కొనేందుకు సిద్ధమైనవారు. ఈ సర్వే ప్రకారం 2030నాటికి పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాలను విద్యుత్ కార్లు అధిగమిస్తాయని తేలింది. వినియోగదారులు సుముఖంగా ఉంటేనే ఏ విధానం అయినా సక్సెస్ అవుతుంది. ఇక్కడ యువతలో విద్యుత్ కార్లపై మక్కువ ఎక్కువ, కొత్తగా కారు తీసుకోవాలనుకునేవారు విద్యుత్ కార్ల గురించి ఎంక్వయిరీ చేస్తున్నారు. యువత ఇష్టపడుతోంది కాబట్టి, రాబోయే ఎనిమిదేళ్లలో ఆ మ్యాజిక్ జరిగే అవకాశముందని సర్వే సంస్థల అంచనా వేస్తున్నాయి.

నష్టాలేంటి..?

విద్యుత్ వాహనాలతో ఉపయోగాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయని వాహన యజమానులు చెబుతున్నారు. ఛార్జింగ్‌ సదుపాయాలు తగినంతగా లేకపోవటం, విద్యుత్తు వాహనాలు కాలిపోతున్న సంఘటనలు, బ్యాటరీ మార్చడానికి ఎక్కువ ఖర్చు, దూర ప్రాంతాలకు వెళ్లేందుకు అనువుగా ఉండకపోవడం వంటి సమస్యలున్నాయి. బ్యాటరీ ఛార్జింగ్ కే ఎక్కువ సమయం పడుతోందని సగం మంది వావనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోల్చి చూస్తే.. విద్యుత్ వాహనాల పికప్ తక్కువగా ఉంటుందని ఇది మరో ప్రధాన ఇబ్బంది అంటున్నారు.

ప్రస్తుతం తయారీ సంస్థలన్నీ ఈ సమస్యలపై దృష్టిపెట్టాయి. విరివిగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం, సులభంగా బ్యాటరీలు మార్చుకోవడం, త్వరగా చార్జింగ్ అయ్యేలా కొత్త టెక్నాలజీ అభివృద్ధి చేయడం వంటి వాటిపై దృష్టిపెట్టారు. ఇవన్నీ అనుకున్నట్టు జరిగితే విద్యుత్ కార్ల వినియోగం 2030నాటికి గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు.

Tags:    
Advertisement

Similar News