బార్లు బంద్.. ఎన్నికల స్టంట్ గా మద్యం పాలసీ

ఇకపై అక్కడ మందు తాగాలంటే షాపులో బాటిల్ కొనుక్కుని నేరుగా ఇంటికెళ్లాలి, లేదా ఎవరూ చూడని ప్రదేశానికి వెళ్లి నాలుగు గుటకలు వేసి తిరిగొచ్చేయాలి.

Advertisement
Update:2023-02-20 11:48 IST

అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులోకి తెస్తామని హామీ ఇచ్చిన జగన్, ఇప్పుడు ముందు వెనక ఆలోచిస్తున్నారు. విడతల వారీగా మద్యం వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామంటూ రేట్లు భారీగా పెంచారు. ఖజానాకు లాభం వచ్చిందే మద్యం వినియోగం తగ్గలేదు. వచ్చే ఎన్నికలనాటికి మద్యం పాలసీ విషయంలో జగన్ ఎలాంటి కొత్త హామీ ఇచ్చే సాహసం చేయకపోవచ్చు. కేవలం ఏపీలోనే కాదు, దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా మద్యం పాలసీ అనేది ఎన్నికల స్టంట్ గానే మారింది. మధ్యప్రదేశ్ లో ని బీజేపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎన్నికలకోసం మద్యం షాపులపై కన్నెర్ర చేసింది. బార్లు బంద్ అంటూ ఆర్డర్లు ఇచ్చేసింది.

బార్లు, పర్మిట్ రూమ్ లకు మధ్యప్రదేశ్ లో కాలం చెల్లింది. ఇకపై అక్కడ మందు తాగాలంటే షాపులో బాటిల్ కొనుక్కుని నేరుగా ఇంటికెళ్లాలి, లేదా ఎవరూ చూడని ప్రదేశానికి వెళ్లి నాలుగు గుటకలు వేసి తిరిగొచ్చేయాలి. బార్లో కూర్చుని దర్జాగా మందు తాగుతూ, మంచింగ్ ఆర్డర్ ఇవ్వాలంటే మధ్యప్రదేశ్ లో కుదరని పని. కనీసం వైన్ షాప్ పక్కన పర్మిట్ రూమ్ లు కూడా ఇకపై కనిపించవు.

ఇప్పుడే ఎందుకు..?

మధ్యప్రదేశ్ లో కూడా మద్యపాన నిషేధంపై ఎప్పటినుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఉమాభారతి స్వయంగా మందు షాపుల్ని ధ్వంసం చేసి, ఇటీవల ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిలోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కనీసం మహిళల సింపతీ ఓట్లయినా పడతాయనే ఆశతో సీఎం బార్లు బంద్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈమేరకు నూతన మద్యం విధానానికి మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

విద్యాసంస్థలు, గర్ల్స్‌ హాస్టళ్లు, ప్రార్థనా ప్రదేశాలకు 100 మీటర్ల లోపు మద్యం దుకాణాలకు అనుమతి లేదనే రూల్ కూడా తీసుకొచ్చారు. మద్యం తాగి వాహనాలు నడిపే కేసుల్లో మరిన్ని కఠిన చర్యలు తీసుకునేలా మార్పులు తీసుకొచ్చారు. 2010నుంచి మధ్యప్రదేశ్ లో కొత్తగా ఒక్క షాపుకూడా తెరవలేదని, మద్యం వినియోగాన్ని తగ్గిస్తున్నామని చెప్పారాయన. ఎన్నికల పుణ్యమా అని మధ్యప్రదేశ్ లో బార్లు ఎత్తేసింది ప్రభుత్వం, అదే సమయంలో లిక్కర్ షాపులను కూడా పూర్తిగా తగ్గించాలని కోరుతున్నారు ప్రజలు.

Tags:    
Advertisement

Similar News