ఎన్నికల షెడ్యూల్ విడుదల నేడే.. మధ్యాహ్నం ఈసీ ప్రెస్ మీట్
కేంద్ర ఎన్నికల సంఘం మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రెస్ మీట్ లోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈరోజు విడుదలవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రెస్ మీట్ లోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. ఇటీవలే ఐదు రాష్ట్రాల్లో ఈసీ పర్యటన పూర్తయింది. ఈ పర్యటన అనంతరం ఢిల్లీలో సమీక్ష తర్వాత షెడ్యూల్ ప్రకటన ఉంటుందని ఇదివరకే అధికారులు స్పష్టం చేశారు. ఈరోజు షెడ్యూల్ ప్రకటించబోతున్నారు.
తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మిజోరాంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వాస్తవానికి ఈ పాటికే నోటిఫికేషన్ రావాల్సి ఉన్నా.. మధ్యలో జమిలి జాతర మొదలైంది. జమిలి ఎన్నికలకోసం కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు గందరగోళానికి దారితీశాయి. జమిలి కోసం ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడతాయని అనుకున్నారు. జమిలి కమిటీ కూడా పనులు మొదలు పెట్టడంతో అందరిలో అదే అనుమానం మొదలైంది. కానీ ఈసారికి జమిలి వాయిదా పడినట్టే తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ రెడీ అయింది.
సెమీ ఫైనల్..
ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికలు సెమీ ఫైనల్స్ లాంటివి. ఈ ఎన్నికలకోసం బీజేపీ చెమటోడుస్తోంది. ఇటు ఇండియా కూటమితో కాంగ్రెస్ కూడా ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తోంది. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అభ్యర్థుల ప్రకటన, అలకలు, ఫిరాయింపులు.. రోజువారీ వ్యవహారాలుగా మారిపోయాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలయితే ఈ సందడి మరింత పెరుగుతుంది.