షాకింగ్.. సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గోయల్ రాజీనామా
గోయల్ తన రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాలను ప్రస్తావించినట్లు ఉన్నతాధికారులు చెప్తున్నారు. పదవిలో కొనసాగాలని ప్రభుత్వ పెద్దలు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అంగీకరించలేదని సమాచారం.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలకపరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్యాంగా రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు పంపించగా.. ఆమె గోయల్ రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది.
2027 డిసెంబరు వరకు అరుణ్ గోయల్ పదవీకాలం ఉంది. వచ్చే ఏడాది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పదవీ విరమణ చేయనుండగా.. గోయల్ పదవిలో కొనసాగి ఉంటే సీఈసీగా పదోన్నతి పొందేవారు. అయితే ఇప్పటివరకూ గోయల్ రాజీనామాకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
1985 పంజాబ్ కేడర్‌కు చెందిన మాజీ IAS అధికారి గోయల్.. 2022 నవంబర్ 18న వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. తర్వాత రోజు వ్యవధిలోనే ఆయన ఎలక్షన్ కమిషన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ అంశం సుప్రీంకోర్టులోనూ చర్చకు వచ్చింది. అంతా హడావుడిగా నియామకం చేపట్టాల్సిన అవసరం ఏం ఉందని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఇక గోయల్ తన రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాలను ప్రస్తావించినట్లు ఉన్నతాధికారులు చెప్తున్నారు. పదవిలో కొనసాగాలని ప్రభుత్వ పెద్దలు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అంగీకరించలేదని సమాచారం. మరో వారం రోజుల్లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడులవుతుందని అంతా భావిస్తున్న టైంలో.. అనూహ్యంగా గోయల్ రాజీనామా చేయడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.
గోయల్ రాజీనామాతో ముగ్గురు సభ్యులు ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రాజీవ్ కుమార్ ఒక్కరు మాత్రమే మిగిలారు. మరో ఎలక్షన్ కమిషనర్ అనూప్ పాండే గత నెలలో రిటైర్ అయ్యారు.