బీబీసీ ఇండియాపై ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసు
గుజరాత్ అల్లర్లలో మోదీ హస్తం ఉందని `ఇండియా : ద మోదీ క్వశ్చన్` పేరిట రెండు భాగాలుగా ఇటీవల విడుదలైన డాక్యుమెంటరీలో బీబీసీ పేర్కొంది.
ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఇండియా విదేశీ నిధుల వ్యవహారంలో ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగా ఆర్థిక లావాదేవీల వివరాలు సమర్పించాలని ఆదేశించింది. అలాగే ప్రవాసుల నుంచి అందిన నిధుల వివరాలు పరిశీలిస్తున్నట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి.
బీబీసీ ఇండియా కార్యాలయంలో కొద్ది నెలల క్రితం ఐటీ శాఖ తనిఖీలు నిర్వహించింది. అయితే అవి తనిఖీలు కాదు.. సర్వే అని అప్పట్లో అధికారులు చెప్పారు. అయితే.. గోద్రా మారణకాండ వెనుక అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రమేయం ఉందంటూ బీబీసీ ఓ వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొద్దిరోజుల తర్వాత ఈ తనిఖీలు చేపట్టడం గమనార్హం.
గుజరాత్ అల్లర్లలో మోదీ హస్తం ఉందని `ఇండియా : ద మోదీ క్వశ్చన్` పేరిట రెండు భాగాలుగా ఇటీవల విడుదలైన డాక్యుమెంటరీలో బీబీసీ పేర్కొంది. దీనిపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్లర్లపై న్యాయస్థానాల్లో మోదీకి క్లీన్‌చిట్ లభించిన తర్వాత ఇలా అభాండాలు వేయడమేమిటని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన లింకులను సోషల్ మీడియాలో కేంద్రం నిషేధించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈడీ ఫెమా యాక్ట్ కింద బీబీసీ ఇండియాపై కేసు నమోదు చేసింది.