మనీశ్ సిసోడియా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
మనీశ్ సిసోడియాకు సంబంధించిన బ్యాంకు బ్యాలెన్సు రూ.11.49 లక్షలు, బ్రిండ్కో సేల్స్ ప్రైవేటు లిమిటెడ్ (రూ.16.45 కోట్లు) ఆస్తులతో పాటు ఈ కేసులో ఇతరులకు సంబంధించి రూ.44.29 కోట్ల విలువైన చరాస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ తెలిపింది.
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కీలక నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా పలువురి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. సిసోడియాతో పాటు ఆయన భార్య, ఇతర నిందితులకు చెందిన రూ.52 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసినట్టు శుక్రవారం ప్రకటించింది ఈడీ.
మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద సిసోడియా, ఆయన సతీమణి సీమా సిసోడియాకు చెందిన రెండు స్థిరాస్తులతో పాటు మరో ఇద్దరు నిందితులైన రాజేశ్ జోషీ (చారియట్ ప్రొడెక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్)కు చెందిన భూమి/ఫ్లాట్, గౌతమ్ మల్హోత్రాకు చెందిన భూమి / ఫ్లాట్ మొత్తంగా రూ.7.29 కోట్ల స్థిరాస్తులను అటాచ్ చేసినట్టు ప్రొవిజినల్ ఆర్డర్‌లో పేర్కొంది.
మనీశ్ సిసోడియాకు సంబంధించిన బ్యాంకు బ్యాలెన్సు రూ.11.49 లక్షలు, బ్రిండ్కో సేల్స్ ప్రైవేటు లిమిటెడ్ (రూ.16.45 కోట్లు) ఆస్తులతో పాటు ఈ కేసులో ఇతరులకు సంబంధించి రూ.44.29 కోట్ల విలువైన చరాస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ తెలిపింది. అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.52.24 కోట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియాను మార్చిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.