షిండేదే అసలైన సేన.. పార్టీ పేరు, గుర్తు.. ఆయనకే

ఇప్పుడు తుది నిర్ణయం షిండే వర్గానికి అనుకూలంగా వచ్చింది. అసలు శివసేన షిండేదేనని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. పార్టీ పేరు, గుర్తు కూడా ఆయన వర్గానికే దక్కుతుందని చెప్పింది.

Advertisement
Update:2023-02-17 19:38 IST

శివసేన చీలిక వర్గాల మధ్య ఉన్న గొడవకు ఎన్నికల కమిషన్ ముగింపు పలికింది. శివసేన పార్టీ పేరుని, గుర్తుని చీలిక షిండే వర్గానికే అప్పగించేలా నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. ఇకపై శివసేన అనే పేరు, పార్టీ గుర్తు విల్లంబు-బాణం.. షిండే వర్గానికే చెందుతాయి.

2022లో ఉద్ధవ్ థాక్రే నాయకత్వాన్ని కాదని, సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే పార్టీని నిట్టనిలువునా చీల్చారు. చీలిక ఎమ్మెల్యేలతో ఆయన బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, ఫలితంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి సీటు సంపాదించారు. షిండే తిరుగుబాటుతో సీఎం సీటు కోల్పోయిన ఉద్ధవ్ థాక్రే.. అసలైన శివసేన తనదేనన్నారు. తన తండ్రి స్థాపించిన పార్టీపై సర్వ హక్కులు తమకే దక్కుతాయన్నారు. ఎన్నికల కమిషన్ ని ఆశ్రయించారు. మరోవైపు ఫిరాయింపుదారులపై వేటు వేసిన స్పీకర్ నిర్ణయాన్ని అమలు చేయాలంటూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు.

పార్టీ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ ఇరు వర్గాలకు నోటీసులిచ్చింది. తాత్కాలికంగా రెండు వర్గాలకు వేర్వేరు గుర్తుల్ని కేటాయించి శివసేన అసలు గుర్తుని రిజర్వ్ లో పెట్టింది. ఇప్పుడు తుది నిర్ణయం షిండే వర్గానికి అనుకూలంగా వచ్చింది. అసలు శివసేన షిండేదేనని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. పార్టీ పేరు, గుర్తు కూడా ఆయన వర్గానికే దక్కుతుందని చెప్పింది.

ఇటు సుప్రీంకోర్టులో కూడా ఉద్ధవ్ థాక్రేకి చుక్కెదురయ్యే అవకాశాలున్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు ఉద్ధవ్ థాక్రే వేసిన పిటిషన్ పై తీర్పుని రిజర్వ్ లో పెట్టింది సుప్రీంకోర్టు. స్పీకర్ ని తొలగించే నిర్ణయం పెండింగ్ లో ఉండగా, అదే స్పీకర్ కు సభ్యులపై అనర్హత వేటు వేసే అధికారం ఉండదని షిండే వర్గం వాదిస్తోంది. ఈ కేసు విచారణ ఫిబ్రవరి 21కి వాయిదా పడింది.

Tags:    
Advertisement

Similar News