వీర్ సావర్కర్ మీద ప్రేమ సరే, ఇక్బాల్ మీద ద్వేషమెందుకు?
ఇటీవలి ఢిల్లీ విశ్వవిద్యాలయం బి.ఏ. రాజనీతిశాస్త్రం సిలబస్‌లోంచి మహాత్మాగాంధీ మీద ఉన్న పాఠాలను తొలగించి, ఆ స్థానంలో వీర్ సావర్కర్ బోధనలను పాఠ్యాంశాలుగా చేర్చాలని నిర్ణయించారు.
చరిత్రను మార్చడం, ఏమార్చడం, వక్రీకరించడం కాషాయ పాలకుల ఏలుబడిలో మామూలు విషయమై పోయింది. అబద్ధాలతో చరిత్రను తిరగరాసే కుటిలత్వంలో భాగంగా విశ్వవిద్యాలయాల సిలబస్‌నే మార్చేస్తున్నారు. ఇటీవలి ఢిల్లీ విశ్వవిద్యాలయం బి.ఏ. రాజనీతిశాస్త్రం సిలబస్‌లోంచి మహాత్మాగాంధీ మీద ఉన్న పాఠాలను తొలగించి, ఆ స్థానంలో వీర్ సావర్కర్ బోధనలను పాఠ్యాంశాలుగా చేర్చాలని నిర్ణయించారు. హిందూత్వ ప్రతినిధి వీర్ సావర్కర్ గురించి విశ్వవిద్యాలయ సిలబస్‌లో చేర్చడం ఇదే మొదటిసారి. గాంధీస్థానంలో గాడ్సే గురువు వీర్‌సావర్కర్ పాఠ్యాంశం కావడం కాషాయ పాలకుల నైజాన్ని చెబుతున్నది. ఢిల్లీ విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిల్ సావర్కర్ మీద ప్రేమను కనబరచడంతోనే ఆగలేదు. దశాబ్దాలుగా సిలబస్‌లో ఉన్న మహమ్మద్ ఇక్బాల్‌కు సంబంధించిన పాఠ్యాంశాలను సిలబస్‌లో నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయాల మీద నిరసనలు వెల్లువెత్తడం, పెద్దఎత్తున చర్చ జరుగుతుండటంతో తమకు వత్తాసు పలికే ప్రాఫెసర్లు, సూడో చరిత్రకారులు, మేధావులను రంగంలోకి దింపింది కాషాయ పరివారం. యువతలో దేశభక్తి భావాలని ప్రోది చేసేందుకు స్వాతంత్య్రం కోసం వీరోచితంగా పోరాడిన వీర్ సావర్కర్‌ను సిలబస్‌లో పెట్టడం సముచితమైందని ఢిల్లీ విశ్వవిద్యాలయం చర్యని సమర్థించింది సంఘ్ పరివార్ అనుకూల మేధావుల బృందం. బ్రిటిష్ వారిని క్షమాభిక్ష కోరిన వీర్‌సావర్కర్ యువతకు ఏవిధంగా స్ఫూర్తి అవుతాడో మాత్రం చెప్పలేదు. ‘అఖండ భారత్’ అన్న సావర్కర్ స్వప్నం గురించి విద్యార్థులు తెలుసుకోడం అవసరమని వారు భావించడం మరింత విచిత్రం.
‘అఖండ భారత్’ అన్న భావనే వాస్తవ విరుద్ధం. వారు చెబుతున్న ‘అఖండ్ భారత్’లో భూటాన్, నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక భారత్‌లో అంతర్భాగంగా ఉన్నాయి. కానీ చరిత్రలో ఏనాడూ ఏ ఒక్క రాజుగానీ, చక్రవర్తి గానీ మొత్తం భారతదేశాన్ని పాలించలేదు. ఒక దేశంగా వారి సామ్రాజ్యాన్ని నిర్మించలేదు. ‘అఖండ భారత్’ అన్నది వీర్ సావర్కర్ ఊహాజనిత భావనే తప్ప ఎలాంటి చారిత్రక ఆధారం లేనిది. అయినప్పటికీ హిందూత్వ పేరుతో తప్పుడు భావనల్ని ప్రచారం చేసిన సావర్కర్ భావనల్ని సిలబస్‌లో పెట్టడం అనుచితం.
సావర్కర్ మీద సంకుచిత ప్రేమతోనే ఆగిపోలేదు, ఇస్లాం మీద వ్యతిరేకతతో ప్రముఖ కవి మహమ్మద్ ఇక్బాల్‌కు సంబంధించిన పాఠాలను బి.ఏ. సిలబస్‌లోంచి తీసేశారు.
ఆయన తాత్వికభావాలు దేశవిభజనకు, పాకిస్థాన్ ఆవిర్భావానికి కారణమైనవన్న పేరుతో ఇక్బాల్‌కు సంబంధించిన అధ్యాయాన్ని పొలిటికల్ సైన్స్‌లోని ఆధునిక భారత రాజనీతి తత్వశాస్త్రం సిలబస్‌లోంచి తొలగించడం అకాడమిక్ వర్గాలలో చర్చానీయాంశమైంది. ఇస్లామిక్ సమాజంలో పునరుజ్జీవనం కోసం తపించిన కవి ఇక్బాల్. ఆయన కవిత్వం, తాత్విక భావాలు సరిహద్దుల ఎల్లలకు అతీతమైనవి. పాకిస్థాన్‌ను ఆయనను జాతీయకవిగా పరిగణించవచ్చు గాక ఆయన భావాలు, సృజనాత్మక వ్యాసంగం విశ్వజనీన భావాలతో కూడినవి. ఇస్లామిక్ దేశాలలో సంస్కరణలు రావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఇక్బాల్‌పై వ్యతిరేకత, ద్వేషం ఎందుకని కొందరు చరిత్రకారులు, ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నారు. సిలబస్‌లోంచి తొలగించినంత మాత్రాను ‘‘సారా జహాసే అచ్చా హిందూస్థాన్ హమారా’ అన్న ఇక్బాల్‌ని, ముస్లిం సమాజంలో సంస్కరణల కోసం సరికొత్త ఆలోచనలని అందించిన ఆయన కంట్రిబ్యూషన్‌ను చరిత్ర నుంచి చెరిపేయలేరు.
హిందూత్వవాదానికి ప్రతీకగా వున్న సావర్కర్ జీవితంలోని విభిన్న అంశాలను ఏమార్చలేరు. ఆయన స్వాతంత్య్రం కోసం పోరాడిరదీ, క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్ వారికి లేఖలు రాసిందీ రెండూ నిజమే. హిందూత్వ పేరుతో హిందూ మహాసభ వ్యవస్థాపకునిగా సంకుచిత భావాలతో విద్వేష రాజకీయాల్ని రాజేసిన వాస్తవమూ ఎవరూ మరవలేరు. అయినప్పటికీ చరిత్రని వక్రీకరించే కుటిలత్వంతో పాఠ్యాంశాలనే మార్చేస్తున్నారు. ‘సర్వేజనా సుఖినో భవంతు’ అన్నది భారతీయ సిద్ధాంతం. దీనికి భిన్నంగా విద్వేషపూరిత రాజకీయాలతో విద్యారంగంలో వక్రీకరణలకు పాల్పడటాన్ని లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, ఆలోచనాపరులు నిలదీస్తున్నారు. ఇదేనా బిజెపి ప్రభుత్వం చెబుతున్న ‘నూతన విద్యావిధానం’ అని ప్రశ్నిస్తున్నారు.