విమానంలో వృద్ధురాలిపై మూత్ర విసర్జన.. టాటా గ్రూప్ చైర్మన్ కి బాధితురాలి లేఖ

విమానంలో మధ్యాహ్న భోజనం తర్వాత లైట్లు ఆపివేశారు. ఆ సమయంలో ఓ వ్యక్తి వృద్ధురాలి వద్దకు వచ్చి ఆమెపై మూత్ర విసర్జన చేశాడు. మూత్రవిసర్జన తర్వాత కూడా ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లకుండా కొంతసేపు అలాగే నిలబడే ఉన్నాడు.

Advertisement
Update:2023-01-04 15:07 IST

ఈ మధ్య విమానాలు కూడా ఆర్టీసీ బస్సులను తలపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్లో సీటు కోసం ఇద్దరు ప్రయాణికులు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. చెంపలు వాయించుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన మరొక ఘటనలో ఓ వ్యక్తి తప్ప తాగి తాను విమానంలో ఉన్నానన్న సంగతి కూడా మరిచి ఒక వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఆ వ్యక్తి వికృత చేష్టకు వృద్ధురాలు భయభ్రాంతికి గురయ్యారు.

నవంబర్ 26వ తేదీన ఈ సంఘటన ఎయిర్ ఇండియా విమానంలో జరగగా.. తన పట్ల అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఎయిర్ లైన్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ బాధితురాలు టాటా గ్రూప్ చైర్మన్ కి లేఖ రాయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో 70 ఏళ్ల వృద్ధురాలు బిజినెస్ క్లాసులో ప్రయాణించారు.

విమానంలో మధ్యాహ్న భోజనం తర్వాత లైట్లు ఆపివేశారు. ఆ సమయంలో ఓ వ్యక్తి వృద్ధురాలి వద్దకు వచ్చి ఆమెపై మూత్ర విసర్జన చేశాడు. మూత్రవిసర్జన తర్వాత కూడా ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లకుండా కొంతసేపు అలాగే నిలబడే ఉన్నాడు. ఆ వ్యక్తి వికృత చేష్టతో వృద్ధురాలి దుస్తులు, షూస్ తడిచిపోయాయి. ఆ తర్వాత వృద్ధురాలు జరిగిన విషయమై విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు.

వారు మూత్రం పోసిన సీట్ కు కవర్ మార్చి స్మెల్ రాకుండా స్ప్రే కొట్టారు. ఆ తర్వాత బాధితురాలికి దుస్తులు, చెప్పులు ఇచ్చి అదే సీటులో కూర్చొమని చెప్పారు. అందుకామె నిరాకరించి మరొక వ్యక్తి సీట్లో కూర్చొని మిగతా ప్రయాణాన్ని కొనసాగించారు. ఢిల్లీలో విమానం ల్యాండ్ అయిన తర్వాత వృద్ధురాలు జరిగిన విషయమై ఎయిర్ లైన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు మూత్ర విసర్జన చేసిన వ్యక్తి పట్ల ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

దీంతో బాధితురాలు విమానంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ టాటా గ్రూప్ చైర్మన్ కు ఒక లేఖ రాశారు. ఒక వ్యక్తి తనపై మూత్రం పోసినప్పటికీ బిజినెస్ క్లాసులో సీట్లన్నీ ఖాళీగా ఉన్నా తనకు మరొక క్యాబిన్ సీటు కూడా ఇవ్వలేదని ఆమె ఎయిర్ ఇండియా సిబ్బందిపై ఆరోపణలు చేశారు. కాగా ఈ విషయమై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ లైన్ నుంచి వివరణ కోరింది. ఈ నేపథ్యంలో విమానంలో వికృత చేష్టకు పాల్పడ్డ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకుంటామని తాజాగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. అంతేకాక ఆ వ్యక్తిని తమ సంస్థకు చెందిన విమానాల్లో ప్రయాణించకుండా నో ఫ్లై లిస్ట్ లో చేర్చుతామని తెలిపింది.

Tags:    
Advertisement

Similar News