యూపీలో మరో ఎన్‌కౌంటర్.. గ్యాంగ్‌స్టర్‌ అనిల్ దుజానా హతం

గ్యాంగ్‌స్టర్‌ అనిల్ దుజానాపై హత్య, దోపిడీ వంటి 62 కేసులు నమోదయ్యాయి. కొంతకాలంగా జైల్లో ఉన్న అనిల్ ఈనెల 10వ తేదీన జైలు నుంచి విడుదల అయ్యాడు.

Advertisement
Update:2023-05-04 17:23 IST

ఉత్తర ప్రదేశ్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. మరో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్‌ హతమయ్యాడు. పోలీసులు ఎప్ప‌టిలాగే సదరు గ్యాంగ్ తమకు ఎదురుపడింది.. వాళ్లు కాల్పులు ప్రారంభించడంతో తాము కూడా ఆత్మ రక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపాం..ఈ ఎన్ కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్‌ చనిపోయాడు.. అంటూ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సుమారు 190 మంది ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు.

దీంతో ఉత్తరప్రదేశ్‌లో నేరస్తులు వణికిపోతున్నారు. ఎప్పుడు చావు తమను వెంటాడుతుందో అని భయపడుతున్నారు. జైళ్లలో ఉన్నవాళ్లు కూడా బెయిల్ కోసం ప్రయత్నించడం లేదు. చివరికి మెడికల్ చెకప్‌ల కోసం కూడా ఆస్పత్రికి వెళ్ళమంటూ జైళ్లలోనే గడుపుతున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్‌ కమ్ పొలిటికల్ లీడర్ అతిక్ అహ్మద్ కొడుకు అసద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఆ తర్వాత పోలీసుల సమక్షంలోనే అతిక్ అహ్మద్, అతడి సోదరుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.

ఈ సంఘటన జరిగి రోజులు గడవకముందే ఇప్పుడు యూపీలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. మీరట్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్‌ అనిల్ దుజానా హతమయ్యాడు. ఇతడిపై హత్య, దోపిడీ వంటి 62 కేసులు నమోదయ్యాయి. కొంతకాలంగా జైల్లో ఉన్న అనిల్ దుజానా ఈనెల 10వ తేదీన జైలు నుంచి విడుదల అయ్యాడు. ఇవాళ మీరట్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, అనిల్ దుజానా గ్యాంగ్ మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అనిల్ దుజానా హతమైనట్లు పోలీసులు ప్రకటించారు. 

Tags:    
Advertisement

Similar News