ఓటు లైట్ తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి!
రాజకీయాల మీద ఉండే దురభిప్రాయం, బద్ధకం వంటి కారణాల వల్ల చాలామంది ఓటు వేయడాన్ని లైట్ తీసుకుంటుంటారు. ఇలాంటి ధోరణి వల్ల ప్రజాస్వామ్యానికి చాలా నష్టం జరుగుతుందంటున్నారు నిపుణులు.
రాజకీయాల మీద ఉండే దురభిప్రాయం, బద్ధకం వంటి కారణాల వల్ల చాలామంది ఓటు వేయడాన్ని లైట్ తీసుకుంటుంటారు. ఇలాంటి ధోరణి వల్ల ప్రజాస్వామ్యానికి చాలా నష్టం జరుగుతుందంటున్నారు నిపుణులు. ఓటు వేయడం ఎందుకు ముఖ్యమంటే..
‘నేను నా దేశ ప్రజల చేతికి కత్తి ఇవ్వలేదు. ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులవుతారో, అమ్ముకుని బానిసలవుతారో వాళ్ల చేతుల్లోనే ఉంది’ అని అంబేద్కర్ అన్నారు. ఓటు అనేది మిమ్మల్ని మీరు పాలించుకునేందుకు ఉన్న అవకాశం. ఓటును ఉపయోగించుకోకుండా కేవలం ప్రభుత్వాలను నిందించడం వల్ల లాభం ఉండదు. కాబట్టి దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే ప్రతి ఒక్కరూ ఓటు ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేయడం అత్యంత అవసరం.
ఇక ఓటు ఎవరికి వేయాలి? ఎందుకు వేయాలి? అన్న విషయానికొస్తే.. ఆ ప్రశ్న ఎవరికి వారు వేసుకోవాలి. ఈ విషయంలో బయటివాళ్ల అభిప్రాయాలు, ప్రచారాలకు ప్రభావితం అవ్వకుండా మీ సొంత నిర్ణయం తీసుకోవాలి. మీ ప్రాంత అభ్యర్థి ఎలాంటి వారు? గతంలో ఎమ్మెల్యేగా బాధ్యతలు సరిగ్గా నిర్వహించారా? సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలకు అందుబాటులో ఉన్నారా? ఒకవేళ కొత్త అభ్యర్థి అయితే తన మాట తీరు ఎలా ఉంది? ప్రాంతంలోని సమస్యలపై అవగాహనతో మాట్లాడుతున్నాడా? లేదా ఓట్ల కోసం మాయ మాటలు చెప్తున్నారా? బరిలో ఉన్నవారిలో సమర్థులెవరు? వంటి పలు విషయాలు ఆలోచించి ఓటు వేయాలి. ఒకవేళ అభ్యర్థులెవరూ మీకు నచ్చకపోతే నచ్చలేదనే విషయం ఓటు ద్వారా తెలియజేసేందుకు నోటా అనే ఆప్షన్ కూడా ఉంది.
ప్రాసెస్ ఇదీ..
ఓటు వేయడానికి వెళ్లేముందు ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. స్థానిక ఓటరు నమోదు కేంద్రంలో ఆ వివరాలు ఉంటాయి.
ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు వెంట ఓటరు కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డుని తీసుకెళ్లాలి. ఓటర్ చీటి కోసం పోలింగ్ కేంద్రాల్లో ఉండే పొలిటికల్ పార్టీల ఏజెంట్లను అడగొచ్చు.
పోలింగ్ కేంద్రానికి వెళ్లాక మీ ఓటరు చీటి, గుర్తింపు కార్డులను చూపించాలి. అప్పుడు పోలింగ్ ఆఫీసర్ ఓటరు జాబితాలో మీ పేరును పరిశీలించి వేలికి ఇంకు పూస్తారు. ఆ తర్వాత మరో చీటి ఇస్తారు. ఆ చీటిని మరో అధికారి వద్ద చూపించి ఈవీయం బూత్‌లోకి వెళ్లి మీకు ఈవీఎం మెషీన్‌లో బటన్ నొక్కి ఓటు వేయాలి. ఓటు వేసిన పక్కనే ఉండే వీవీ ప్యాట్‌లో ఒక స్లిప్ వస్తుంది. అది వస్తే మీ ఓటు నమోదు అయినట్టు. ఇదీ ఓటు వేసే ప్రాసెస్.
ఇకపోతే అనారోగ్యంగా ఉన్నవాళ్లు, ఎండల్లో ఇబ్బంది పడలేని వాళ్లు ఉదయం తొమ్మిది గంటలకు ముందు లేదా సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో ఓటు వేసేలా ప్లాన్ చేసుకోవాలి.