పిరమైన ప్రధాని.. విమాన చార్జీలు 41శాతం పెంచారు

అమెరికాలో వెయ్యి కిలోమీటర్ల దూరానికి టికెట్ ధర 4వేల రూపాయలు కాగా భారత్ లో ఇంచుమించు అదే దూరానికి టికెట్ ధర రూ.7వేల వరకు ఉంది.

Advertisement
Update:2023-06-21 09:24 IST

ప్రియమైన ప్రధాని కాదు, పిరమైన ప్రధాని అంటూ మోదీపై సెటైర్లు పేల్చేవారు మంత్రి కేటీఆర్. పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకే కాదు, ఎగువ మధ్యతరగతి ఉన్నతాదాయ వర్గాలకు కూడా చుక్కలు చూపెడుతున్నారు ప్రధాని. హవాయి చెప్పులు వేసుకునేవారు కూడా హవాయి జహాజ్ (విమానం)లో తిరగాలి అనేది తన కల అని పదే పదే చెప్పుకునే మోదీ ఇప్పుడు దానికి పూర్తి రివర్స్ లో చార్జీలు పెంచేసారు. కరోనా తర్వాత ఏకంగా 41 శాతం చార్జీలు పెరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇతర ఏ దేశంలో కూడా భారత్ లో లాగా చార్జీలు పెరగలేదని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.

కరోనా తర్వాత భారత్‌ లో దేశీయ విమాన ఛార్జీలు 41 శాతం పెరిగినట్టు ఎయిర్‌ పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ ఏసియా – పసిఫిక్‌ అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. మొత్తం 36 వేల రూట్లలో విమాన ఛార్జీలను అధ్యయనం చేసి ఈ నివేదిక బయటపెట్టింది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే విమాన చార్జీల పెంపు భారీగా ఉందని తేల్చింది. విమాన ఇంధన ధరలు భారీగా పెంచిన కేంద్రం, విమాన సంస్థలకు రేట్లు పెంచుకునే అవకాశం కల్పించడం ద్వారా ప్రజలపై భారం మోపింది.

2020 మే నెలలో ప్రభుత్వం విమాన ఛార్జీలపై పరిమితి విధించింది. అడ్డగోలుగా చార్జీలు పెంచుకోడానికి వీలు లేదంది. కానీ ఆ తర్వాత ఎవరి ఒత్తిడి బలంగా పనిచేసిందో తెలియదు కానీ ఏకంగా గేట్లు ఎత్తివేసింది. దీంతో విమానయాన సంస్థలు ఇష్టం వచ్చినట్టు చార్జీలు పెంచేశాయి. కరోనాకి ముందు, ఆ తర్వాత పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. 2022 సెప్టెంబర్ లో పరిమితి ఎత్తివేయగా ఇప్పటి వరకు చార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో వెయ్యి కిలోమీటర్ల దూరానికి టికెట్ ధర 4వేల రూపాయలు కాగా భారత్ లో ఇంచుమించు అదే దూరానికి టికెట్ ధర రూ.7వేల వరకు ఉంది. అంటే అమెరికాకంటే విమానయానం మన దగ్గరే బాగా ఖరీదు అన్నమాట. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ బాదుడు మరీ ఎక్కువ.

ఎక్సైజ్ బాదుడు..

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతోపాటు విమాన ఇంధన ధరలను కూడా కేంద్రం విపరీతంగా పెంచడంతో ఈ పరిస్థితి వచ్చింది. 2020 సెప్టెంబర్‌ లో విమాన ఇంధన ధర వెయ్యి లీటర్లకు రూ.39,492 కాగా, ఇప్పుడది రూ.89,303కు చేరుకుంది. గత జులైలో రూ.1,41,233కు చేరుకొని ఆల్‌ టైమ్‌ రికార్డు సృష్టించి ఇప్పుడు కాస్త నెమ్మదించింది. గతంలో విమాన ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీ 8శాతం కాగా బీజేపీ హయాంలో 14శాతానికి పెంచారు. రూపాయి విలువ పతనం కావడంతో విమానయాన సంస్థల మెయింటెనెన్స్ భారం కూడా పెరుగుతోంది. కేంద్రం చిత్తశుద్ధితో లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తేలింది.

Tags:    
Advertisement

Similar News