ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం.. డాక్టర్ దంపతులు సహా ఆరుగురి సజీవ దహనం

అందరూ గాఢ నిద్రలో ఉండటంతో మంటలు ఎగసిపడి దట్టమైన పొగ వ్యాపించింది. పొగ, మంటల కారణంగా ఆస్పత్రిలో ఉన్నవారు బయటకు రాలేకపోయారు.

Advertisement
Update:2023-01-28 15:08 IST

జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డాక్టర్ దంపతులు సహా మొత్తం ఆరుగురు సజీవ దహనమ‌య్యారు. మరో 9 మందిని పోలీసులు రక్షించారు. ముందుగా ఆస్ప‌త్రి స్టోర్ రూమ్ లో మంటలు చెలరేగి అవి పైఅంతస్తుకు వ్యాపించడంతో గాఢ నిద్రలో ఉన్నవారు బయటికి వచ్చే పరిస్థితి లేక సజీవ దహనం అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

ధన్ బాద్ బ్యాంక్ మోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ దంపతులు వికాస్ హజ్రా, ప్రేమ హజ్రా పేరుతో ఒక క్లినిక్ నిర్వహిస్తున్నారు. అలాగే పైఅంతస్తులో రోగులకు వార్డు, డాక్టర్ నివాసం ఉంది. ఇదిలా ఉండగా ఇవాళ తెల్లవారుజామున ఆస్ప‌త్రి స్టోర్ రూమ్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అవి పైఅంతస్తుకు వ్యాపించాయి.

అందరూ గాఢ నిద్రలో ఉండటంతో మంటలు ఎగసిపడి దట్టమైన పొగ వ్యాపించింది. పొగ, మంటల కారణంగా ఆస్పత్రిలో ఉన్నవారు బయటకు రాలేకపోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు. వార్డుల్లో చిక్కుకుపోయిన తొమ్మిది మంది రోగులను కాపాడి చికిత్స నిమిత్తం సమీపంలోని మ‌రో ఆస్ప‌త్రికి తరలించారు.

ఈ ప్ర‌మాద ఘటనలో మొత్తం ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో డాక్టర్ దంపతులు వికాస్ హజ్రా, ప్రేమ హజ్రా, వికాస్ మేనల్లుడు సోహాన్ ఖమారి, ఇంటి పనిమనిషి తారా దేవి, మరో ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆస్పత్రి స్టోర్ రూమ్ లో మంటలు చెలరేగినట్లు పోలీసులు నిర్ధారించారు.

Tags:    
Advertisement

Similar News