తమిళనాడు బీజేపీ అధ్యక్షుడికి రూ.500 కోట్ల పరువు నష్టం నోటీస్
సీఎంతో పాటు పార్టీ నేతల పరువుకు నష్టం కలిగించినందుకు రూ.500 కోట్ల పరిహారం చెల్లించాలని, అంతేగాక బేషరతు క్షమాపణ చెప్పాలని, దీంతో పాటు సోషల్ మీడియాలో ఆ ఆరోపణలకు సంబంధించిన వీడియోలను తొలగించాలని డిమాండ్ చేశారు
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలైకి పరువు నష్టం కింద రూ.500 కోట్లు చెల్లించాలంటూ డీఎంకే పార్టీ ఆదివారం నోటీసులు పంపించింది. `డీఎంకే ఫైల్స్` పేరుతో అన్నమలై ఇటీవల అసత్య ఆరోపణలు చేశారంటూ ఆ నోటీసులో పేర్కొంది. ఇందుకు గాను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటు పరువు నష్టం కింద రూ.500 కోట్లు చెల్లించాలని నోటీసులు పంపించింది.
డీఎంకే పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పాటు ఆ పార్టీ నేతలపై అన్నమలై చేసిన ఆరోపణలు అవాస్తవాలని, నిరాధారమైనవని డీఎంకే ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆర్ఎస్ భారతి పేర్కొన్నారు. ఈ ఆరోపణలు పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె సూచన మేరకు డీఎంకే రాజ్యసభ సభ్యుడు పి.విల్సన్ 10 పేజీల నోటీసును అన్నమలైకి జారీ చేశారు.
సీఎంతో పాటు పార్టీ నేతల పరువుకు నష్టం కలిగించినందుకు రూ.500 కోట్ల పరిహారం చెల్లించాలని, అంతేగాక బేషరతు క్షమాపణ చెప్పాలని, దీంతో పాటు సోషల్ మీడియాలో ఆ ఆరోపణలకు సంబంధించిన వీడియోలను తొలగించాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా అన్నమలై ఈ నోటీసులపై స్పందించాలని, లేదంటే సివిల్, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమిళనాట ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. దీనికి అన్నమలై ఎలా స్పందిస్తారనేది వేచిచూడాలి.