జైషా ఎన్ని సెంచరీలు కొట్టారంటే..?

కేంద్రంలో అధికారం చలాయిస్తోన్నవారి విద్యార్హతలు అడిగే స్థాయికి తాము దిగజారలేదంటూ బీజేపీ విమర్శలను తిప్పికొట్టారు డీఎంకే నేతలు. విద్వేష, విభజన రాజకీయాలకు బీజేపీ పెట్టింది పేరని అన్నారు.

Advertisement
Update:2022-09-23 20:48 IST

ఆ మధ్య భారత క్రికెట్ జట్టు విజయం తర్వాత భారత జాతీయ జెండా పట్టుకోడానికి విముఖత చూపి వార్తల్లోకెక్కారు బీసీసీఐ సెక్రటరీ జైషా. క్రికెట్‌తో ఏమాత్రం సంబంధం లేకపోయినా, అమిత్ షా కొడుకు అనే ఒకే ఒక్క అర్హతతో... జైషా అందలమెక్కారు. కానీ బీజేపీ మాత్రం వారసత్వ రాజకీయాలకు తాము దూరమంటూ పత్తిత్తులా మాట్లాడుతుంది. జైషా విషయంలో అప్పట్లోనే పెద్ద దుమారం చెలరేగింది. బీసీసీఐ కార్యదర్శిగా పనిచేసేందుకు ఆయనకున్న అర్హతలేంటని చాలామంది ప్రశ్నించారు. తాజాగా.. జైషా ఎన్ని సెంచరీలు కొట్టారంటూ వెటకారమాడారు డీఎంకే నేతలు.

డీఎంకేపై బీజేపీ విమర్శలు..

తమిళనాడు పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు డీఎంకే నేతలకు కోపం తెప్పించాయి. నూతన విద్యావిధానం, నీట్‌ను తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, చదువు రాని వాళ్ల పాలన ఇలాగే ఉంటుందని కామెంట్ చేశారు నడ్డా. నడ్డా వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది డీఎంకే. కేంద్రంలో అధికారం చలాయిస్తోన్నవారి విద్యార్హతలు అడిగే స్థాయికి తాము దిగజారలేదంటూ ఆ విమర్శలను తిప్పికొట్టారు డీఎంకే నేతలు. విద్వేష, విభజన రాజకీయాలకు బీజేపీ పెట్టింది పేరని, యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో ఆ పార్టీ విఫలమైందని విమర్శించారు డీఎంకే నేతలు. తమిళనాడు ప్రజలు తెలివైనవారని, 2024లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని డీఎంకే తరపున ఓ ప్రకటన విడుదల చేశారు.

వారసత్వ రాజకీయాలు ఎవరివి...?

వారసత్వ రాజకీయాలకు తాము దూరం అంటూ పదే పదే చెప్పుకుంటారు బీజేపీ నేతలు. తమిళనాడులో వారసత్వ రాజకీయాలున్నాయని విమర్శించారు జేపీ నడ్డా. ఈ క్రమంలో డీఎంకే నేతలు జైషా ప్రస్తావన తెచ్చారు. అసలు జైషా ఏ అర్హతతో బీసీసీఐ పీఠం ఎక్కారని ప్రశ్నించారు. ఆయన ఎన్ని సెంచరీలు కొట్టారంటూ వెటకారం చేశారు.

Tags:    
Advertisement

Similar News