రాహుల్‌పై అనర్హత వేటు వ్యవహారం: ఈ రోజు కీలక పరిణామం

రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడటం తో రాజకీయ పార్టీలు తమ రూటును మార్చుకున్నట్టు కనపడుతోంది. కాంగ్రెస్ తో కలవడానికి, ఆ పార్టీతో ఒకే వేదిక పంచుకోవడానికి నిన్నటి దాకా ఇష్టపడని త్రుణమూల్ కాంగ్రెస్, బీఆరెస్, ఆప్ లు ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement
Update:2023-03-27 12:04 IST

కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీపై పార్ల‌మెంట్ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసిన అనంతరం దేశ‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్ తో ఉప్పు, నిప్పుగా ఉన్న పలు పార్టీలు రాహుల్ కు మద్దతు ప్రకటించడమే కాకుండా బీజేపీ వ్యతిరేక పోరాటంలో కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్నాయి.

అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ పార్లమెంటులో విపక్షాలు కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిరసనల్లో త్రుణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆరెస్ లు కాంగ్రెస్ తో కలవకుండా వేరు వేరుగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. అందరినీ కలుపుకపోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించినప్పటికీ ఆ పార్టీతో కలిసి సాగడానికి పలు పార్టీలు సిద్దం కాలేదు.

అయితే రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడటం తో రాజకీయ పార్టీలు తమ రూటును మార్చుకున్నట్టు కనపడుతోంది. కాంగ్రెస్ తో కలవడానికి, ఆ పార్టీతో ఒకే వేదిక పంచుకోవడానికి నిన్నటి దాకా ఇష్టపడని త్రుణమూల్ కాంగ్రెస్, బీఆరెస్, ఆప్ లు ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.

నేటి పార్లమెంటు సమావేశాల్లో వ్యవహరించవలసిన తీరుపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ రోజు ఉదయం రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చాంబర్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశాలకు ఇప్పటి వరకు హాజరుకాని భారత రాష్ట్ర సమితి, త్రుణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఈరోజు హాజరయ్యాయి.

అంతే కాక పార్లమెంటులో రాహుల్ గాంధీ అనర్హత వ్యవహారంపై అన్ని పక్షాలు కలిసి నిరసనలకు దిగాయి.

రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలన్నీ ఐక్యమవుతాయనడానికి ఈ పరిణామం సూచికనా, లేక ఇది తాత్కాలిక పరిణామమేనా అనేది త్వరలో తేలిపోవచ్చు. 

Tags:    
Advertisement

Similar News