Rahul Gandhi Disqualification: దేశవ్యాప్త పోరాటానికి కాంగ్రెస్ నిర్ణయం
సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ పోరాటాలు మూడు అంచెలుగా సాగనున్నాయి. న్యాయ పోరాటం, దేశవ్యాప్తంగా నిరసనలు, విపక్షాలతో కలిసి ఉమ్మడి ఆందోళనలు జరపాలని ఈ సమావేశంలో నేతలు నిర్ణయం తీసుకున్నారు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త పోరాటానికి సిద్దమయ్యింది. ఈ మేరకు కాంగ్రెస్ ముఖ్యనేతలతో ఈ రోజు సాయంత్రం జరిగిన అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సోనియా గాంధీ, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం,కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ , కెసి వేణుగోపాల్, జైరాం రమేష్, రాజీవ్ శుక్లా, తారిక్ అన్వర్, సీనియర్ నేతలు ఆనంద్ శర్మ, అంబికా సోనీ, ముకుల్ వాస్నిక్, సల్మాన్ ఖుర్షీద్, పవన్ కుమార్ బన్సాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొనలేదు.
దాదాపు రెండు గంటలపాటు సాగిన(ఇంకా సాగుతోంది) ఈ సమావేశంలో సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పోరాటాలు మూడు అంచెలుగా సాగనున్నాయి. న్యాయ పోరాటం, దేశవ్యాప్తంగా నిరసనలు, విపక్షాలతో కలిసి ఉమ్మడి ఆందోళనలు జరపాలని ఈ సమావేశంలో నేతలు నిర్ణయం తీసుకున్నారు.
ఈ మొత్తం కార్యక్రమాల నిర్వహణను కోఆర్డినేట్ చేసేందుకు ముఖ్యమైన నేతలతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. సమావేశం ఇంకా సాగుతున్నందున ఆందోళనలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ రేపు తెలియజేస్తామని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మీడియాకు చెప్పారు.