ఒడిశాలో బీభత్సం.. 2 గంటల్లో 61 వేల పిడుగులు
గజపతి, జగత్‌సింగ్‌పూర్, పూరీ, బలంగీర్ జిల్లాల్లో పిడుగుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆయా జిల్లాల్లో మూగజీవాలు సైతం పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి.
ఒడిశాలో పిడుగుల వర్షం కురిసింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఒడిశా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 61 వేల పిడుగులు పడ్డాయి. దీంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఒడిశా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెప్టెంబరు 7 వరకు ఇవే పరిస్థితులు కొనసాగే అకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 48 గంటల్లో అల్పపీడనంగా మారవచ్చని పేర్కొంది. ఈ కారణంగా ఒడిశావ్యాప్తంగా భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది.
గజపతి, జగత్‌సింగ్‌పూర్, పూరీ, బలంగీర్ జిల్లాల్లో పిడుగుల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆయా జిల్లాల్లో మూగజీవాలు సైతం పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి. ఇక పిడుగుపాటు వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ. 4 లక్షల నష్ట పరిహారం ప్రకటించింది. సుదీర్ఘ విరామం తర్వాత రుతుపవనాలు సాధారణ స్థితికి చేరుకున్నప్పుడు ఇలా పిడుగులు పడే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గడిచిన 26 గంటల్లో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో 12 సెంటీమీటర్లు, కటక్‌లో 9 సెంటమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు అధికారులు. ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని కోరారు.