కాశ్మీర్ లో యాపిల్ రైతుల కష్టాలు.. 500కోట్ల మేర నష్టాలు..

ఒకవేళ కాయలు కుళ్లిపోకముందే మార్కెట్ కి చేరుకున్నా.. ట్రాఫిక్ సమస్యల వల్ల అన్ని ట్రక్కులు ఒకేసారి హోల్ సేల్ మార్కెట్ కి వస్తాయి. అంటే ధర దారుణంగా పడిపోతుంది.

Advertisement
Update:2022-09-29 09:49 IST

అధికారుల ఉదాసీనత వల్ల కాశ్మీర్ లో యాపిల్ రైతులు తీవ్ర కష్టాలపాలవుతున్నారు. ఈ ఏడాది ఈ ఒక్క సీజన్లోనే రైతులు 500 కోట్ల రూపాయల మేర నష్టపోతున్నట్టు తెలుస్తోంది. కారణం కాశ్మీర్ వ్యాలీలో రహదారి మరమ్మతులు. వ్యాలీలో రహదారి మరమ్మతుల కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీని కారణంగా ఇప్పటికే 5వేల ట్రక్కులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాయి. డెలివరీ ఆలస్యం అయితే యాపిల్ కాయలు కుళ్లిపోతాయి. ఒకవేళ కాయలు కుళ్లిపోకముందే మార్కెట్ కి చేరుకున్నా.. ట్రాఫిక్ సమస్యల వల్ల అన్ని ట్రక్కులు ఒకేసారి హోల్ సేల్ మార్కెట్ కి వస్తాయి. అంటే ధర దారుణంగా పడిపోతుంది. రెండు విధాల రైతులు నష్టపోవాల్సి వస్తోంది.

20టన్నులకు పైగా యాపిల్స్ తో ఒక్కో ట్రక్కు కాశ్మీర్ వ్యాలీనుంచి బయలుదేరింది. ఇలాంటి 5వేల ట్రక్కులు ఇంకా గమ్యస్థానాలకు చేరుకోలేదు. రోడ్డు సమస్యలపై యాపిల్ ఫార్మర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFFI) లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు, అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు ఓ పోలీస్ అధికారిని ట్రాన్స్ ఫర్ చేసి చేతులు దులుపుకున్నారు అధికారులు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ట్రాఫిక్ లో చిక్కుకున్న ట్రక్కులకు యాపిల్స్ సప్ల‌య్‌ చేసినవారు ఇబ్బందులు పడుతున్నారు. సరకు మార్కెట్ కి రాలేదని అవతలినుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇటు ట్రక్కుల్లో మగ్గిపోతున్న యాపిల్స్ నాణ్యత రోజు రోజుకీ క్షీణిస్తోంది. ఈ దశలో యాపిల్స్ ని ఎలా సంరక్షించుకోవాలో తెలియక వారు సతమతం అవుతున్నారు.

మరోవైపు కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని అధిక మొత్తంలో రైతుల వద్ద డబ్బు డిమాండ్ చేస్తున్నాయి. చిన్నరైతులు కోల్డ్ స్టోరేజ్ లవైపు వెళ్లలేక తక్కువరేటుకే యాపిల్స్ ని దళారీలకు తెగనమ్ముతున్నారు. మార్కెట్ ధర పెరిగినప్పుడు దళారీలు సరకుని మార్కెట్లోకి వదులుతున్నారు. కేజీ 60రూపాయలకంటే తక్కువకు పడిపోతే రైతులు నష్టపోతారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. ఒకవేళ ప్రభుత్వం మార్కెట్ పై నియంత్రణ చర్యలు తీసుకున్నా అవి కేవలం దళారీలకు మాత్రమే ఉపయోగపడతాయని అంటోంది AFFI. ఇప్పటికైనా తమ గోడు పట్టించుకోవాలని రహదారి సమస్యలు తీర్చాలని లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు లేఖ రాశారు.

Tags:    
Advertisement

Similar News