ప్రయాణికులకు గుడ్ న్యూస్.. గ్రేడ్ తగ్గిస్తే విమాన టికెట్ సొమ్ము వెనక్కి
బోర్డింగ్ నిరాకరించడం, విమానాల రద్దు, విమానాల ఆలస్యం కారణంగా విమానయాన సంస్థలతో ప్రయాణికులకు కలిగే అసౌకర్యాలకు ఇకపై పరిహారం చెల్లించాల్సిందేనంటోంది DGCA
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇది. భారత విమానయాన రంగ నియంత్రణ సంస్థ (DGCA) కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది. ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లను ఎయిర్ లైన్స్ సంస్థలు ఏకపక్షంగా డౌన్ గ్రేడ్ చేస్తే.. టికెట్ సొమ్ములో 75 శాతం తిరిగి ఇవ్వాలనే నిబంధన తీసుకొచ్చారు. దేశీయ ప్రయాణాల్లో 75 శాతం మొత్తం తిరిగివ్వాల్సిందే. అంతర్జాతీయ ప్రయాణాల్లో మాత్రం ప్రయాణ దూరాన్నిబట్టి 30 శాతం నుంచి 75శాతం వరకు టికెట్ సొమ్ము తిరిగివ్వాల్సి ఉంటుంది.
విమానయాన సంస్థలను బట్టి, ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్, ఫస్ట్ క్లాస్ లు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నవారికి, ప్రయాణానికి ముందు హఠాత్తుగా బిజినెస్ లేదా ఎకానమీ క్లాస్ కి మారిస్తే టికెట్ రేటులో 75 శాతం తిరిగి ప్రయాణికులకు చెల్లించేలా DGCA నిర్ణయం తీసుకొచ్చింది. బిజినెస్ క్లాస్ ని ప్రీమియం ఎకానమీకి మార్చినా, ప్రీమియం ఎకానమీని, ఎకానమీ క్లాస్ కి మార్చినా కూడా అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్పి తప్పించుకోవడం ఇకపై కుదరదు. కచ్చితంగా టికెట్ రేటులో 75శాతం తిరిగి వెనక్కి ఇవ్వాల్సిందే. అంతర్జాతీయ ప్రయాణాలకు మాత్రం దూరాన్ని బట్టి రేటు మారిపోతుంటుంది.
బోర్డింగ్ నిరాకరించడం, విమానాల రద్దు, విమానాల ఆలస్యం కారణంగా విమానయాన సంస్థలతో ప్రయాణికులకు కలిగే అసౌకర్యాలకు ఇకపై పరిహారం చెల్లించాల్సిందేనంటోంది DGCA. టిక్కెట్ల డౌన్‌గ్రేడ్ వల్ల ప్రభావితమైన విమాన ప్రయాణికుల హక్కులను బలోపేతం చేయడానికి కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్టు తెలిపింది. ఇటీవల కొన్ని ఫ్లైట్లు ప్రయాణికుల్ని ఎక్కించుకోకుండానే బయలుదేరడం, నిర్లక్ష్యంగా విమానాశ్రయాల్లోనే వదిలేయడం, ఆ తర్వాత వేరే విమానాల్లో తక్కువ క్లాస్ ల టికెట్లతో ప్రయాణ సౌకర్యాలు కల్పించడం.. వంటి పరిణామాల నేపథ్యంలో DGCA ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.