ఎయిర్ ఇండియాకు మరో దెబ్బ.. రూ.10 లక్షల ఫైన్ వేసిన డీజీసీఏ

గత నెల 6వ తేదీన ప్యారిస్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు నిబంధనలు ఉల్లంఘించి అభ్యంతరకరంగా ప్రవర్తించాడు.

Advertisement
Update:2023-01-24 21:34 IST

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన ఓ విమానంలో ప్రయాణించిన వ్యక్తి అభ్యంతరకరంగా ప్రవర్తించడంతో డీజీసీఏ ఎయిర్ ఇండియాకు రూ.10 లక్షల జరిమానా విధించింది. కొద్దిరోజుల కిందట ఎయిర్ ఇండియాకు చెందిన ఒక ఇంటర్నేషనల్ విమానంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి వృద్ధురాలిపై మూత్ర విస‌ర్జ‌న చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన తీవ్ర దుమారం సృష్టించడంతో సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ఈ ఘటనలో వృద్ధురాలిపై మూత్రం పోసిన వ్యక్తిపై ఎయిర్ ఇండియా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించింది. ఈ వ్యవహారం మరువక ముందే మరోసారి డీజీసీఏ ఎయిర్ ఇండియా సంస్థకు రూ. 10 లక్షల జరిమానా విధించింది.

గత నెల 6వ తేదీన ప్యారిస్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఒక ప్రయాణికుడు నిబంధనలు ఉల్లంఘించి అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో విమానంలోనే సిగ‌రెట్ తాగాడు. పొగ తాగవద్దని విమాన సిబ్బంది సూచించినప్పటికీ అతడు పట్టించుకోలేదు. అలాగే మరో సీటులోని మహిళకు కేటాయించిన బ్లాంకెట్ ను కూడా అతడు తీసుకున్నాడు.

అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వ్యవహారం డీజీసీఏ వరకు వెళ్లడంతో దీనిపై ఎయిర్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటన జరిగి నెల రోజులు దాటినా విమానంలో అభ్యంతరకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీసీఏ ఎయిర్ ఇండియాను ప్రశ్నించింది. దీనిపై ఎయిర్ ఇండియా ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని డీజీసీఏ ఆ సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. డీజీసీఏ నిర్ణయంతో రోజుల వ్యవధిలోనే రెండోసారి ఎయిర్ ఇండియాకు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.

Tags:    
Advertisement

Similar News