కోటి రూపాయలకు పైగా అప్పులతో మనస్తాపం , భర్త క్రికెట్ బెట్టింగులకు భార్య బలి
బెట్టింగ్‌ల కోసం చేసిన అప్పులు తీర్చలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కర్ణాటకలోనూ దాదాపు ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది.
క్రికెట్ బెట్టింగ్ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. భర్త చేసిన అప్పు తీర్చలేక, రుణదాతల ఒత్తిడి తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదం కర్ణాటక రాష్ట్రంలో మార్చి 18న జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది.
క్రికెట్ బెట్టింగ్ కారణంగా ఎన్నో జీవితాలు సర్వనాశనం అయ్యాయి. బెట్టింగ్‌ల కోసం చేసిన అప్పులు తీర్చలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కర్ణాటకలోనూ దాదాపు ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది.
చిత్రదుర్గ జిల్లాకు చెందిన దర్శన్ బాబు హోసదుర్గలో మైనర్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభుత్వ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. దర్శన్ కు రంజితతో 2020లో వివాహం జరిగింది. దర్శన్‌కు క్రికెట్‌పై బెట్టింగ్ అంటే సరదా. ఈ సరదా కాస్తా నెమ్మదిగా వ్యసనంగా మారింది. 2021 నుంచి 23 వరకు బెట్టింగ్‌లో ఇరుకున్నాడు. మొదట్లో దర్శన్ కొన్ని పందేల్లో గెలవడంతో, రెగ్యులర్‌గా బెట్టింగ్ వేయడం ప్రారంభించాడు.
తాను భారీ మొత్తంలో ఓడిపోయినా.. ఈసారి తప్పకుండా అదృష్టం తలుపు తడుతుందన్న నమ్మకంతో, అప్పులు చేసి మరీ బెట్టింగ్స్ వేశాడు. కానీ.. దురదృష్టవశాత్తూ అతడు క్రమంగా ఓడిపోతూ వచ్చాడు. దీంతో కోటిన్నరకు పైగా అప్పులు చేయాల్సి వచ్చింది. బెట్టింగ్‌లకు డబ్బులు సరిపోని సమయంలో వస్తువును వాళ్ల వద్ద తాకట్టు పెట్టేవాడు. దీంతో వారు ఇంటిపైకి వచ్చే పరిస్థితి ఏర్పడింది.
రుణదాతల వేధింపులతో విసిగిపోయిన అతని భార్య మార్చి 18న ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు విడిచింది. కూతురు మరణంపై తండ్రి వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వడ్డీ వ్యాపారుల నిత్యం వేధింపుల వల్ల తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని వెంకటేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ క్రమంలోనే దర్శన్ బాబుకు అప్పు ఇచ్చిన 13 మంది వడ్డీ వ్యాపారుల పేర్లను కూడా వెంకటేష్ ప్రస్తావించాడు. దర్శన్ మొత్తం రూ. 1.5 కోట్లకు పైగా అప్పు తీసుకొని అందులో రూ. కోటి అప్పు తీర్చగా.. మరో రూ. 84 లక్షలు ఇంకా తీర్చాల్సి ఉందని కర్ణాటక పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ని కనుగొన్నట్టుగా చెబుతున్నారు.