వాట్సప్ సాయంతో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం

మంచు కారణంగా ఆమెను జిల్లా కేంద్రానికి తరలించలేని పరిస్థితి. దీంతో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి నర్సు వాట్సప్ వీడియో కాల్ చేశారు. పరిస్థితి వివరించారు. అక్కడి గైనకాలజిస్ట్ సాయంతో ఇక్కడ సుఖ ప్రసవం చేశారు.

Advertisement
Update:2023-02-12 17:50 IST

జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని కేరాన్ ప్రాంతం అది. రెండురోజులుగా అక్కడ దట్టమైన మంచు కురుస్తోంది. ఇంతలో కేరాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఓ గర్భిణి పురిటి నొప్పులతో వచ్చింది. ఆస్పత్రిలో డాక్టర్ అందుబాటులో లేరు. నర్సుకి డెలివరీ చేయడంలో అంత అనుభవం లేదు. కానీ తప్పదు. మంచు కారణంగా ఆమెను జిల్లా కేంద్రానికి తరలించలేని పరిస్థితి. దీంతో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి నర్సు వాట్సప్ వీడియో కాల్ చేశారు. పరిస్థితి వివరించారు. అక్కడి గైనకాలజిస్ట్ సాయంతో ఇక్కడ సుఖ ప్రసవం చేశారు. ప్రస్తుతానికి తల్లి బిడ్డ క్షేమం. ఎప్పటికప్పుడు వాట్సప్ లోనే వారి యోగక్షేమాలను జిల్లా ఆస్పత్రి వైద్యులు ఆరా తీస్తున్నారు.

వాట్సప్ యూనివర్సిటీ అన్నిటికీ పనికిరాకపోవచ్చు కానీ కొన్ని విషయాల్లో మాత్రం ప్రాణాలు నిలబెడుతుందని ఇలాంటి ఉదాహరణతో స్పష్టమవుతోంది. క్రాల్ పోరా బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహ్మద్ షఫీ ఈ వింత అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. అకస్మాత్తుగా తమకు కేరాన్ పి.హెచ్.సి. నుంచి నర్సు వాట్సప్ వీడియో కాల్ చేసిందని, తాము అక్కడి పరిస్థితి చూసి ఆశ్చర్యపోయామని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రసవానికి సాయం చేశామని చెప్పారు. దాదాపు ఆరుగంటలసేపు వైద్య సహాయం అందించామని సుఖప్రసవం తర్వాత తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారన తెలిపారు.

వాస్తవానికి కుప్వారా జిల్లాలో హిమపాతం సమయంలో అత్యవసర వైద్య సేవలకు హెలికాప్టర్లను ఉపయోగించుకుంటారు. కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి పూర్తిగా అనుకూలించకపోవడంతో చివరకు వైద్యులు వాట్సప్ కాల్ పైనే ఆధారపడ్డారు. అదృష్టవశాత్తు తమ ప్రయత్నం ఫలించిందని, ఏమాత్రం తేడా వచ్చినా వాట్సప్ వీడియో కాల్ తో రిస్క్ అయినా కూడా తాము అప్పటికి అంతకు మించి ప్రత్యామ్నాయం ఆలోచించలేకపోయామని చెబుతున్నారు వైద్యులు.

Tags:    
Advertisement

Similar News