సైబ‌ర్ నేర‌గాళ్ల ఉచ్చులో బ్యాంక్ సీనియ‌ర్ మేనేజ‌ర్‌.. - రూ.90 వేలు క‌ళ్ల‌ముందే మాయం

ఆ వ్య‌క్తి మాట‌ల‌తో ఆ యాప్‌లోకి వెళ్లి బ్యాంకు ఉద్యోగిని.. త‌న యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ కూడా న‌మోదు చేసింది. అంతే.. ఆమె ఫోన్‌పై ఆమెకు నియంత్ర‌ణ లేకుండా పోయింది. అది హ్యాక్ అయింది.

Advertisement
Update:2023-05-28 07:55 IST

ఆమె ఓ బ్యాంకులో సీనియ‌ర్ మేనేజ‌ర్‌. అయినా సైబ‌ర్ నేర‌గాళ్ల ఉచ్చులో ప‌డ్డారు. ఆమె క‌ళ్ల‌ముందే.. రూ.90 వేలు రెండు విడ‌త‌ల్లో మాయ‌మ‌య్యాయి. దీంతో అవాక్క‌వ‌డం ఆమె వంత‌యింది. ఢిల్లీలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి అక్క‌డి పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఒక థాలీ కొంటే.. మ‌రో థాలీ ఫ్రీ అనే ఆఫ‌ర్ ఆమె ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తెలుసుకుంది. ఆ వివ‌రాలు తెలుసుకునేందుకు ఆ సైట్‌లోకి వెళ్లి.. అందులో ఉన్న ఫోన్ నంబ‌ర్‌కు కాల్ చేసింది. ఆమె కాల్‌కు ఎలాంటి స్పంద‌నా రాలేదు. అయితే.. ఆ త‌ర్వాత ఆమెకు ఆ నంబ‌ర్ నుంచి కాల్ వ‌చ్చింది. ఒక ప్ర‌ముఖ రెస్టారెంట్ నుంచి అద‌నంగా థాలీ పొంద‌వ‌చ్చ‌ని ఆ ఆఫ‌ర్ వివ‌రాల‌ను అవ‌త‌లి వ్య‌క్తి వివ‌రించారు. ఆ త‌ర్వాత ఒక లింక్ ని ఫోన్ ద్వారా షేర్ చేశారు. దాని ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ‌ర్ పొంద‌వ‌చ్చ‌ని చెప్పారు. అందుకోసం ముందుగా రిజిస్టర్ కావాలన్నారు.

ఆ వ్య‌క్తి మాట‌ల‌తో ఆ యాప్‌లోకి వెళ్లి బ్యాంకు ఉద్యోగిని.. త‌న యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్ కూడా న‌మోదు చేసింది. అంతే.. ఆమె ఫోన్‌పై ఆమెకు నియంత్ర‌ణ లేకుండా పోయింది. అది హ్యాక్ అయింది. వెంట‌నే రూ.40 వేలు, ఆ త‌ర్వాత రూ.50 వేలు డెబిట్ అయ్యాయ‌ని వ‌రుస‌గా మెసేజ్‌లు వ‌చ్చాయి. వెంట‌నే కంగారుప‌డిన ఆమె త‌న క్రెడిట్ కార్డును బ్లాక్ చేసింది. డ‌బ్బును తొలుత త‌న క్రెడిట్ కార్డు నుంచి త‌న పేటీఎం ఖాతాకు, ఆ త‌ర్వాత న‌కిలీ ఖాతాకు బ‌దిలీ చేశార‌ని బాధితురాలు పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో వివ‌రించింది. ఒకవైపు ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే .. వేరే నగరాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై ఆ ప్రముఖ రెస్టారెంట్ ప్రతినిధిని సంప్రదించగా.. ఈ మోసపూరిత ప్రకటన గురించి త‌మ‌కు ప్రజల నుంచి చాలా కాల్స్ వచ్చాయని, తాము అలాంటి ఆఫర్లు ఏమీ ప్రకటించలేదని తెలిపారు. దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సంద‌ర్భంగా సైబ‌ర్ క్రైమ్ విభాగం అధికారులు స్పందిస్తూ.. ప్ర‌జ‌లు సైబ‌ర్ నేర‌గాళ్ల విష‌యంలో చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. నిరంత‌రం వేర్వేరు మార్గాల ద్వారా ప్ర‌జ‌ల‌ను మోస‌గించాల‌ని సైబ‌ర్ నేర‌స్తులు చూస్తున్నార‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సైబ‌ర్ క్రైమ్ పోలీసులు హెచ్చ‌రించారు.

Tags:    
Advertisement

Similar News